తెలంగాణకు ఆంధ్రా బియ్యం.. భారీగా దిగుమతి

తెలంగాణకు ఆంధ్రా బియ్యం.. భారీగా దిగుమతి
  • నిరుడు వానాకాలం బియ్యం ఈ నెలాఖరులోగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
  • గడువులోపు ఇవ్వకుంటే చర్యలు తప్పవని వార్నింగ్
  • ఎప్పుడో వడ్లు అమ్మేసుకున్న మిల్లర్లు
  • సర్కారు ఆదేశాలతో ఉరుకులు పరుగులు
  • ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ నుంచి బియ్యం భారీగా దిగుమతి

మంచిర్యాల, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) కోసం గత సర్కారు ఇచ్చిన వడ్లను బయట అమ్ముకున్న రైస్ మిల్లర్లు, ఇప్పుడు కొత్త సర్కారు కొరడా ఝులిపిస్తుండడంతో బెంబేలెత్తుతున్నారు. 2022–-23 వానాకాలం సీజన్​కు సంబంధించిన సీఎమ్మార్ టార్గెట్​ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. గడువులోగా బియ్యం అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈక్రమంలో రైస్​మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సివిల్​ సప్లయీస్​, రెవెన్యూ ఆఫీసర్లు బియ్యం మాయం చేసిన మిల్లర్లపై ఆర్​ఆర్ యాక్డ్​ప్రయోగిస్తున్నారు. ఆస్తులు జప్తు చేయడంతో పాటు కేసులు పెట్టి రిమాండ్​కు పంపిస్తున్నారు. దీంతో టార్గెట్​ చేరేందుకు మిల్లర్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎఫ్​సీఐకి అప్పగించేందుకు కావాల్సిన బియ్యం తమ వద్ద లేనివాళ్లు వివిధ జిల్లాల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. ఇది రూల్స్ కు విరుద్ధమైనప్పటికీ.. వే బిల్లులతోనే వస్తుండడంతో ఆఫీసర్లు కూడా చూసీచూడనట్టు  వ్యవహరిస్తున్నారు. దీంతో బియ్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వడ్లు అమ్ముకున్నరు...బియ్యం కొంటున్నరు..

ప్రభుత్వం ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో  కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన వడ్లను సీఎమ్మార్ కోసం మిల్లర్లకు అప్పగిస్తుంది. ఈ వడ్లను మిల్లింగ్ చేసి క్వింటాలుకు 67 నుంచి 68 కిలోల బియ్యం ఇవ్వాలి. ఇందుకుగాను ప్రభుత్వం మిల్లర్లకు చార్జీలను చెల్లిస్తుంది. గత ప్రభుత్వం రైస్ మిల్లర్ల నుంచి ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకుండా లక్షల టన్నుల వడ్లను అప్పగించింది. దీంతో మెజారిటీ మిల్లర్లు.. ఆ వడ్లను మిల్లింగ్ చేసి ఓపెన్ మార్కెట్​లో బియ్యం అమ్ముకోగా.. మరికొందరు ఏకంగా వడ్లనే అమ్ముకున్నారు. ఇంకొందరు వడ్లు అమ్మగా వచ్చిన పైసలను రియల్​ ఎస్టేట్ ​లాంటి వివిధ వ్యాపారాల్లో  పెట్టుబడులు పెట్టారు. ఇలా ఒకటి రెండు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ పెండింగ్ పెట్టి కోట్లలో సంపాదించారు. ఈ నెల 16 నాటికి రాష్ట్రంలో 2022–- 23  వానాకాలానికి సంబంధించి సుమారు 6 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇంకా అప్పగించలేదు. ఇక యాసంగిలో రైతుల నుంచి సేకరించిన 66.84లక్షల టన్నుల వడ్లకు 45.07 లక్షల టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ ​కింద ఇవ్వాల్సిన మిల్లర్లు  కేవలం 10.27లక్షల టన్నులే ఎఫ్​సీఐకి అప్పగించారు. అంటే ఇంకా 70 శాతానికి పైగా బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే  రెండుసార్లు గడువు ఇచ్చిన సివిల్​సప్లై శాఖ, తాజాగా డెడ్​లైన్​ను డిసెంబర్​31కి పొడిగించింది. దీంతో వారం రోజుల్లో పెండింగ్ టార్గెట్​ను పూర్తి చేసేందుకు తంటాలు పడుతున్నారు. గత ప్రభుత్వం సీఎమ్మార్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గడువులు పొడిగించుకుంటూ పోవడం వల్ల సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ రూ.58 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

బియ్యం నాణ్యతపై అనుమానాలు

గడువులోపల టార్గెట్​ చేరుకునేందుకు రైస్ మిల్లర్లు  ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బియ్యం దిగుమతి చేసుకుంటున్నారు. ఆంధ్రా నుంచి మంచిర్యాల జిల్లాకు గత వారం రోజులుగా నిత్యం 10 లారీలకు పైగా బియ్యం లోడ్లు వస్తున్నాయి. నిర్మల్ జిల్లా రైస్ మిల్లర్లు సైతం సీఎంఆర్ కోసం ఆంధ్రా నుంచి బియ్యం తెప్పిస్తున్నారు. ఈ నెల 16న బోధన్, నిజామాబాద్​ మీదుగా నిర్మల్ జిల్లాకు లారీలో తరలిస్తున్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని ఆఫీసర్లు పట్టుకున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా మిల్లర్లు ఇంకా 44 శాతం సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. దీంతో కొద్దిరోజులుగా జార్ఖండ్​​, ,చత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి బియ్యం తెప్పించి ఎఫ్​సీఐకి పెడ్తున్నారు. నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లోని రైస్​మిల్లర్లు మహారాష్ట్ర నుంచి బియ్యం తెప్పిస్తున్నట్టు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల, కరీంనగర్​, నల్గొండ లాంటి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్న  బియ్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు టార్గెట్ గురించి ఆలోచిస్తూ క్వాలిటీని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎఫ్​సీఐ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ... మిల్లర్లు సంబంధిత అధికారులను మేనేజ్ చేసి బియ్యం పాస్ చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో లోడుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు అధికారులకు ముట్ట చెప్తున్నారని, ఇందుకోసం అక్కడ కొంతమంది ఏజెంట్లను పెట్టుకున్నారని సమాచారం.  మరికొందరు మిల్లర్లు రేషన్ బియ్యాన్ని డీలర్ల దగ్గర కొని రీసైక్లింగ్ దందా నడిపిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ శివారులోని మహాలక్ష్మి ఇండస్ట్రీస్ మిల్లుకు గతంలో సర్కార్ కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఇటీవల ప్రభుత్వం నుంచి సీఎంఆర్ విషయంలో ఒత్తిడి పెరగడంతో గ్రామాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ఎఫ్​సీఐకి పంపేలా ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే మిల్లులో 255 క్వింటాళ్ల రేషన్ బియ్యం సేకరించి నిల్వ చేయగా, ఈ నెల 20న  మిల్లుపై పోలీసులు దాడి చేసి గుట్టురట్టు చేశారు.