Andre Russell: గార్డ్ ఆఫ్ హానర్‪తో గౌరవం: ఓటమితోనే రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

Andre Russell: గార్డ్ ఆఫ్ హానర్‪తో గౌరవం: ఓటమితోనే రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. బుధవారం (జూలై 23) ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 తర్వాత రస్సెల్ సొంతగడ్డపై గ్రాండ్ గా గుడ్ బై చెప్పాడు. మ్యాచ్ కు ముందు రస్సెల్ కు అరుదైన గౌరవం లభించింది. జమైకా వేదికగా ముగిసిన రెండో టీ20 మ్యాచ్ కు ముందు వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెటర్లు గార్డ్ ఆఫ్ హానర్ తో గౌరవించారు. తన ఫేర్ వెల్ మ్యాచ్ లో రస్సెల్ కు విండీస్ క్రికెట్ బోర్డు ట్రోఫీతో పాటు బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చి సత్కరించింది. తన చివరి మ్యాచ్ ను రస్సెల్ ఓటమితో ముగించడం విచారకరం. 

ఆస్ట్రేలియాతో జరిగిన తన చివరి మ్యాచ్ లో రస్సెల్ తన విధ్వంసాన్ని చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. బౌలింగ్ లో ఒక ఓవర్ వేసి 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియాతో 5మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ముందు గురువారం (జూలై 18) విండీస్ క్రికెట్ రస్సెల్ రిటైర్మెంట్ గురించి తెలుపుతూ అతని రిటైర్మెంట్ వార్తను నివాళి పోస్ట్‌తో వెల్లడించింది. జమైకాకు చెందిన రస్సెల్ తన చివరి రెండు మ్యాచ్ లు తన సొంతగడ్డ సబీనా పార్క్‌లో ఆడి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే రెండు మ్యాచ్ ల్లోనూ వెస్టిండీస్ ఓడిపోయింది. 

2010 లో రస్సెల్ తన టెస్ట్ క్రికెట్ ద్వారా తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గాలేలో శ్రీలంకపై ఆడిన ఈ టెస్ట్ రస్సెల్ కెరీర్ లో మొదటిది అదే చివరిది. 2011లో వన్డే, టీ20 ల్లో అరంగేట్రం చేశాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో రస్సెల్ విధ్వంసకర ఆటగాడిగా ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. వెస్టిండీస్ తరపున ఓవరాల్ గా 86 టీ20 మ్యాచ్ లాడిన ఈ విడీస్ విధ్వంసకర వీరుడు 22.00 సగటుతో 1,122 పరుగులు చేశాడు. 163.08 స్ట్రైక్ రేట్‌తో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ తన మార్క్ చూపిస్తూ 30.59 సగటుతో 61 వికెట్లు కూడా పడగొట్టాడు. 56 వన్డేల్లో 2229 పరుగులు చేశాడు.  2012, 2016లో వెస్టిండీస్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో రస్సెల్ సభ్యుడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం (జూలై 23) జరిగిన రెండో టీ20 వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది.     మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బ్రాడం కింగ్ (51) హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రస్సెల్ 36 పరుగులు చేసి వేగంగా ఆడాడు. మిగిలిన వారు విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. జోష్ ఇంగ్లిస్(77), గ్రీన్ (56) భారీ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉంది.