వంశపారంపర్యంగా, పోషకాలలోపం వల్ల ఎనీమియా

వంశపారంపర్యంగా, పోషకాలలోపం వల్ల ఎనీమియా

ఎనీమియాని రక్తహీనత అంటారు. దీనిలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. రక్తంలోని హీమోగ్లోబిన్​  అనే ప్రొటీన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. ఈ ప్రొటీన్ తక్కువైతే శరీరంలోని భాగాలకు ఆక్సిజన్​ సరఫరా జరగడంలో ఇబ్బంది అవుతుంది. దాంతో నీరసంగా, అలసటగా కనిపిస్తారు పిల్లలు. ఐరన్​తో పాటు విటమిన్​ బి–12, ఫోలిక్​ యాసిడ్  లోపం ఉన్నా ఎనీమియా వస్తుంది. ఎనీమియాలో... సికిల్ సెల్ ఎనీమియా,  థలసేమియా అని రెండు రకాలు.  ఈ డిసీజ్​ వంశపారంపర్యంగా, పోషకాలలోపం వల్ల వస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే ఎనీమియాని  హెరిడిటరీ ఎనీమియా, పోషకాల లోపం వల్ల వచ్చేదాన్ని ఎక్వైర్డ్ ఎనీమియా అంటారు.  

హెరిడిటరీ ఎనీమియా

కొన్ని రకాల జబ్బులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తాయి. సికిల్​ సెల్ ఎనీమియా, థలసేమియా  కూడా అలాంటివే. కొందరిలో ప్రెగ్నెన్సీ టైంలో సికిల్ సెల్ ఎనీమియా  కనిపిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ సికిల్ సెల్ ఎనీమియా ఉంటే పుట్టబోయే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది.  సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవాళ్లలో ఎర్రరక్తకణాలు కొడవలి లేదా నెలవంక ఆకారంలో ఉంటాయి. అంతేకాదు​ అవి తమ జీవితకాలం 120 రోజుల కంటే ముందుగానే చనిపోతాయి. దాంతో శరీరంలో వాటి సంఖ్య తగ్గిపోతుంది. సికిల్ సెల్​ ఎనీమియాలో సికిల్ సెల్​ ట్రేట్( ఒక జీన్​ సికిల్​ సెల్, మరొకటి నార్మల్ జీన్​)​,  థలసేమియాలో థలసేమియా ట్రేట్​ అని ఉంటాయి. వీటిలో లక్షణాలు అంతగా కనిపించవు.   

ఎక్వైర్డ్ ఎనీమియా

ఐరన్​, విటమిన్​ బి–12 లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎక్వైర్డ్ ఎనీమియా అంటారు. ఇందుకు కారణం... పూర్తిగా శాకాహారం డైట్ తినడం. దాంతో విటమిన్​ బి–12 లోపం ఏర్పడుతుంది.  ఆకుకూరలు, పండ్లు తినకపోవడం వల్ల ఐరన్​ సరిపోను అందదు. దాంతో రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. పొట్టలో నులిపురుగులు ఉన్నా కూడా ఎనీమియా వస్తుంది. అదెలాగంటే... కాళ్లకు చెప్పులు  లేకుండా మట్టిలో ఆడుకోవడం, మట్టి పెళ్లలు  తినడం వల్ల నులిపురుగులు (అస్కేరిస్​ లుంబ్రికాయిడస్​) పిల్లల శరీరంలోకి చేరతాయి. ఇవి పేగుల్లో రక్తం పీల్చుకోవడం వల్ల కూడా ఎనీమియా వస్తుంది. ఈ రకమైన ఎనీమియా ఐదు, ఆరేండ్ల వయసు పిల్లల్లో ఎక్కువ.  

ఈ లక్షణాలు ఉంటే...

ఎనీమియాతో బాధపడే పిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండదు. యాక్టివ్​గా ఉండరు. తొందరగా అలసిపోతారు. చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది. ఆకలి తగ్గుతుంది. తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఒళ్లు నొప్పులు ఉంటాయి.  థలసేమియా ఉంటే కళ్లు పసుపు పచ్చగా మారతాయి. కడుపు ఉబ్బుతుంది. మూత్రం పచ్చగా వస్తుంది. అందుకని పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎనీమియా టెస్ట్ చేయించాలి. 

డయాగ్నసిస్

కంప్లీట్ బ్లడ్ పిక్చర్​ (సి.బి.పి) టెస్ట్ చేసి, ఎర్ర రక్తకణాల సైజ్​ని బట్టి ఏ రకం ఎనీమియా అనేది తెలుసుకుంటారు.  అలాగే హెరిడిటరీ ఎనీమియా అవునా? కాదా? అనేది తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు కూడా సి.బి.పి టెస్ట్ చేస్తారు. ఎనీమియా రకాన్ని బట్టి  ట్రీట్మెంట్ ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలని అన్నిరకాలుగా వండిపెడతారు తల్లులు. కానీ, చాలామంది  కొన్నిరకాల ఫుడ్​ వెరైటీలు మాత్రమే తింటారు. దాంతో శరీరం ఎదుగుదలకు అవసరమైన   పోషకాలు  అందవు పిల్లలకు. ఒకవేళ  ముఖ్యమైన న్యూట్రియెంట్​​ ఐరన్​లోపం ఏర్పడితే ఎనీమియా  డిసీజ్​ వస్తుంది. ఈ సమస్య ఉన్న పిల్లల్లో రక్తం తగ్గుతుంది. దాంతో వీళ్ల గ్రోత్​  సరిగా ఉండదు. అందుకని ఎనీమియా లక్షణాల్ని ముందుగానే పసిగట్టి, ట్రీట్మెంట్ ఇప్పించడం చాలా ముఖ్యం అంటున్నాడు డాక్టర్​ ప్రశాంత్ చంద్ర.