ఆగ్రహించిన చెరుకు రైతులు..గాయత్రి షుగర్స్ ఆఫీసుకు తాళం

ఆగ్రహించిన చెరుకు రైతులు..గాయత్రి షుగర్స్ ఆఫీసుకు తాళం

 మెట్ పల్లి, వెలుగు: పంట కోతలు కోయకుండా గాయత్రి షుగర్స్ యాజమాన్యం ఇబ్బందులు పెడుతోందని ఆగ్రహించిన చెరుకు రైతులు గురువారం గాయత్రి షుగర్స్ ఆఫీస్ లో అధికారులను నిర్బంధించారు. యాజమాన్యం తీరుకు నిరసనగా మూడు గంటలు ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. రైతులు మాట్లాడుతూ గాయత్రి షుగర్స్ యాజమాన్యం గతేడాది మల్లాపూర్ మండలం రాఘవపేట్​చెరుకు రైతులతో ఒప్పందం చేసుకుందన్నారు. అందులో భాగంగా చెరుకు సాగు నుంచి కోతలు, తరలింపు వరకు అన్ని వారే చూసుకుంటామని చెప్పారని, టన్ను చెరుకు కోతలకు రు.800 లేబర్ ఛార్జీలు తీసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. 

ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ 10 శాతం మాత్రమే చెరుకు కోతలు కోశారని మిగతా చెరుకు తోటల్లో అలాగే ఉందన్నారు. పలు మార్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల్లో ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిపివేసే పరిస్థితులున్నాయని, తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల్లో చెరుకు కోతలు పూర్తయ్యాయని, రాఘవపేట్​లో లేబర్ల కొరత పేరిట కోతలు నిలిపివేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గత ఏడాది సైతం ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిపివేయడం వల్ల  కోతలు ఆగడంతో చెరుకును ఖమ్మం ఫ్యాక్టరీకి తరలించామని, వాటి డబ్బులు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

యాజమాన్యం తీరుతో ప్రతి ఏడాది నష్టపోతున్నామని మండిపడ్డారు. చెరుకు కోతలు మొదలుపెట్టేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అధికారులు సముదాయించచడంతో మూడు గంటల తర్వాత ఆఫీస్ తాళం తీశారు. ఈ విషయమై గాయత్రి షుగర్స్ మెట్ పల్లి డివిజన్ సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ వాసు వివరణ కోరగా రాఘవపేట చెరుకు కోతలకు 40 మందితో కూడిన లేబర్ గ్రూప్ ను అలాట్​ చేశామని, వారు కొన్నిరోజులు పని చేసి పారిపోయారని చెప్పారు.రైతులకు ఇబ్బందులకు కలగకుండా చూస్తామన్నారు.