
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు అనిల్ కుమార్ సింఘాల్. 2025, సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం.. శ్రీవారి దర్శనం తర్వాత శ్యామలరావు నుంచి అధికారికంగా ఫైళ్లపై సంతకం చేసి.. టీటీడీ ఈవోగా సీట్లు కూర్చుకున్నారు అనిల్ కుమార్ సింఘాల్. బాధ్యతలు స్వీకరించిన సింఘాల్ కు ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రెండో సారి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించటం అనేది.. దేవుడి కృప, దయ అంటూ వ్యాఖ్యానించారాయన. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ణతలు తెలిపారాయన.
ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సింఘాల్ కు.. అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు.. మూడు సంవత్సరాల నాలుగు నెలల పాటు ఈవోగా సేవలందించే అవకాశం వచ్చిందన్నారాయన. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఇదే విధంగా కొనసాగిస్తానంటూ స్పష్టం చేశారాయన. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని వివరించారాయన. టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని, శ్రీవారి సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని స్పష్టం చేశారాయన.
ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారాయన. ఈ సందర్భంగా ఈవోను శాలువాతో సత్కరించారు చైర్మన్. వీరి వెంట టీటీడీ సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు.