మునిగిపోయే నావ..బీఆర్ఎస్.. అందులోకి పోయి ఆగం కావొద్దు: అంజన్ కుమార్ యాదవ్

 మునిగిపోయే నావ..బీఆర్ఎస్.. అందులోకి పోయి ఆగం కావొద్దు: అంజన్ కుమార్ యాదవ్

మరో ఇరవై రోజుల్లో మునిగిపోయే నావ బిఆర్ఎస్ పార్టీ అని... అందులోకి పోయి ఆగం కావొద్దని ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులను మభ్యపెట్టి బిఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 20వ తేదీ సోమవారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇంచార్జ్ తమిళనాడు ఎమ్మెల్యే రూబీ మనోహర్ తో కలిసి అంజన్ కుమార్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ... కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని...రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ రావాలని దీవిస్తున్నారని అన్నారు. హామీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

బీఆర్ఎస్, బీజేపీల పట్ల ప్రజలు విసుగు చెంది ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయమని ఆయన అన్నారు. ముషీరాబాద్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు చేసిన అభివృద్ధే తప్ప.. కొత్తగా ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని అంజన్ కుమార్ యాదవ్ కోరారు.