బీసీలు రాజకీయంగా ఏకం కావాలి : అంజన్ కుమార్ యాదవ్

బీసీలు రాజకీయంగా ఏకం కావాలి : అంజన్ కుమార్ యాదవ్
  •     పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్ల కురుమలకు ఇవ్వాలి : అంజన్ కుమార్ యాదవ్

హైదరాబాద్, వెలుగు : రాజకీయంగా బీసీలకు రావాల్సిన వాటా రావడం లేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. బీసీలంతా రాజకీయంగా ఏకమై తమ వాటా కోసం పోరాడాలని ఆయన సూచించారు. పీసీసీ చీఫ్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని గొల్ల కురుమలకు ఇవ్వాలని ఏఐసీసీ నేతలను ఆయన కోరారు. మంగళవారం హైదరాబాద్​ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ యాదవ, కురుమ ముఖ్య నేతలు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సమావేశమయ్యారు.

ఈ మీటింగ్​లో మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, పీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్, అధికార ప్రతినిధులు గౌరీ సతీశ్ యావవ్, లోకేశ్​ యాదవ్, పీసీసీ సెక్రటరీలు రాజేశ్, గడ్డం శేఖర్ యాదవ్, సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధని భూమన్న యాదవ్, మాజీ కార్పొరేటర్ కల్పన యాదవ్, కాంగ్రెస్ నేత మధుకర్ యాదవ్ పాల్గొన్నారు. గత  బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు గొల్ల కురుమలను విస్మరించిందన్నారు. గొర్లు, చేపలు ఇచ్చి కోటీశ్వరులను చేసినట్టు ప్రచారం చేసుకుందని అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

బీసీల్లో ఎక్కువ శాతం ఉన్న గొల్ల కురుములకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కేబినెట్ లో ఒక బెర్త్, రెండు ఎమ్మెల్సీ సీట్లు, జడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ చైర్మన్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వీసీ పదవులు ఇవ్వాలని అంజన్ కోరారు. రాజీవ్ గాంధీ గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరమని ఆయన ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీపై కేటీఆర్  చేసిన కామెంట్లపై గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు తిప్పి కొట్టాలని అంజన్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.