తెలుగువారి సంక్రాంతి పండుగ అంటేనే టాలీవుడ్ లో బాక్సాఫీస్ సమరం. ఈ ఏడాది సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి ' మన శంకర వరప్రసాద్ గారు' రెబల్ స్టార్ ప్రభాస్ ' ది రాజాసాబ్ ' మాస్ మహారాజ్ రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' , నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' వంటి భారీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇంతటి గట్టి పోటీ మధ్యలో యంగ్ హీరో శర్వానంద్ ' నారీ నారీ నడుమ మురారి ' చిత్రం బరిలోకి దిగి అందరిని దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మూవీలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించారు.
నవ్వుల విందుతో..
చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ కు ఈ 2026 సంక్రాంతి పండగ మర్చిపోలేని విజయాన్ని అందించింది. ‘సామజవరగమన’ వంటి క్లీన్ హిట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ అబ్బరాజు, మళ్ళీ అదే మేజిక్‌ను రిపీట్ చేస్తూ రూపొందించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. భారీ అంచనాలతో జనవరి 14న సాయంత్రం 5:49 గంటల ప్రత్యేక షోలతో థియేటర్లలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ ప్రేక్షకులకు నవ్వుల విందును వడ్డిస్తోంది.
కథా నేపథ్యం.. ఇద్దరు భామల మధ్య మురారి తిప్పలు
గౌతమ్ (శర్వానంద్) ఒక ఆర్కిటెక్ట్. తను పనిచేసే ఆఫీసులోనే నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయణం సాఫీగా సాగుతున్న క్రమంలో, అదే ఆఫీసుకు టీమ్ లీడర్‌గా గౌతమ్ మాజీ ప్రేయసి దియా (సంయుక్త మీనన్) ఎంట్రీ ఇస్తుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గౌతమ్ జీవితం ఈ ఇద్దరు భామల మధ్య ఎలా నలిగిపోయింది? తన గతాన్ని ప్రస్తుత ప్రేయసికి ఎలా దాచాడు? చివరికి గౌతమ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అనే అంశాలను దర్శకుడు హిలేరియస్ కామెడీతో మలిచారు.
వినోదమే పరమావధిగా..
దర్శకుడు రామ్ అబ్బరాజు తన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫార్ములాను మరోసారి సమర్థవంతంగా వాడుకున్నారు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినప్పటికీ, దానిని నడిపించిన స్క్రీన్‌ప్లే, పండించిన హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నేటి కాలపు సంబంధాలు, తండ్రి-కొడుకుల మధ్య ఉండే సరదా గొడవలను చాలా సహజంగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. బోర్ కొట్టించని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ నిలిస్తుందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
తనకి కలిసొచ్చిన కామెడీ టైమింగ్‌తో శర్వానంద్ అదరగొట్టారు. చాలా కాలం తర్వాత ఒక ‘పక్కా ఫ్యామిలీ హీరో’గా తన పూర్వ వైభవాన్ని గుర్తుచేశారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడిగా ఆయన హావభావాలు నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమాకు అసలైన బలం సీనియర్ నటుడు నరేష్. హీరో తండ్రి పాత్రలో ఆయన చేసిన కామెడీ వెండితెరపై మ్యాజిక్ చేసింది. తన కంటే వయసులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆ వయసులో తండ్రి కాబోయే వ్యక్తిగా ఆయన పండించిన హాస్యం థియేటర్లను హోరెత్తిస్తోంది. సంయుక్త మీనన్ తన పాత్రకు హుందాతనాన్ని తీసుకురాగా, సాక్షి వైద్య తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్ తమ మార్కు కామెడీతో సినిమా వేగాన్ని పెంచారు.
బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం
విశాల్ చంద్రశేఖర్ సంగీతం పండుగ వాతావరణానికి తగ్గట్టుగా ఉంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు సినిమాను రిచ్‌గా చూపించాయి. భోగవరపు కథ, నందు సావిరిగన చురుకైన సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయి. ఈ చిత్రం కేవలం విమర్శకుల ప్రశంసలే కాదు, వసూళ్ల పరంగా కూడా సత్తా చాటుతోంది. బుక్‌మైషో (BookMyShow)లో గంటకు 5,000 పైగా టిక్కెట్లు అమ్ముడవుతుండటం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనం. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో థియేటర్ల యజమానులు అదనపు షోలను ఏర్పాటు చేస్తున్నారు.
సంయుక్త మీనన్ భావోద్వేగ ట్వీట్
సినిమాకు వస్తున్న విశేష స్పందనపై చిత్ర కథానాయిక సంయుక్త మీనన్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. "అందరికీ సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు! 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాన్ని మీ దగ్గరలోని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ పండుగ వేడుకల్లో మా సినిమా ద్వారా మరిన్ని నవ్వులను, ఆనందాన్ని నింపగలిగినందుకు మా చిత్ర యూనిట్ అంతా ఎంతో సంతోషంగా ఉంది," అంటూ పోస్ట్ చేశారు.
Happy Sankranthi and Pongal to Everyone ♥️♥️♥️ Enjoy #NariNariNadumaMurari in theatres . Thank you so much for the amazing reviews and feeling happy that we could add extra happiness to your festival celebrations 🤗🤗🤗 pic.twitter.com/s3ybLKmjMp
— Samyuktha (@iamsamyuktha_) January 15, 2026
సంక్రాంతి వంటి పెద్ద పండుగ సమయంలో ప్రేక్షకులు కోరుకునే పూర్తి స్థాయి వినోదాన్ని ‘నారీ నారీ నడుమ మురారి’ వంద శాతం అందించింది. ఎటువంటి అశ్లీలత లేకుండా, కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా నవ్వుకునే ఈ చిత్రం ఈ సీజన్ లో 'క్లీన్ హిట్'గా నిలిచిందని సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబట్టుతుందో చూడాలి మరి.
