భారతీయులకు జాబ్స్ ఇవ్వొద్దంటూ అమెరికాలో రచ్చ.. ఆ రెండు కంపెనీలపై బాయ్ కాట్ ఉద్యమం..

భారతీయులకు జాబ్స్ ఇవ్వొద్దంటూ అమెరికాలో రచ్చ.. ఆ రెండు కంపెనీలపై బాయ్ కాట్ ఉద్యమం..

అమెరికాలో స్థిరపడాలనే కలలు కనే భారతీయులకు.. అక్కడ ఇప్పటికే ఉన్నత పదవుల్లో ఉన్న ప్రవాస భారతీయులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత H-1B వీసా నిబంధనలను కఠినతరం చేయడం.. విదేశీ కార్మికులపై ఆంక్షలు విధించడంతో అమెరికాలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్లు  ఒక్కసారిగా పెరిగాయి. ఇది కేవలం విధాన నిర్ణయాలకే పరిమితం కాకుండా.. సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఉద్యమానికి, వేధింపులకు కూడా దారితీస్తూ క్రమంగా చేజారుతోంది. 

అమెరికాలోని కార్పొరేట్ కంపెనీలైన ఫెడెక్స్, వాల్‌మార్ట్, వెరిజోన్ లాంటి పెద్ద కంపెనీలు ప్రస్తుతం ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలు అమెరికన్లను తొలగించి, వారి స్థానంలో భారతీయులను నియమించుకుంటున్నాయని న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా ఫెడెక్స్ సీఈఓ రాజ్‌ సుబ్రమణ్యం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో.. ఆ కంపెనీపై జాత్యహంకార వ్యాఖ్యలు పెరిగాయి. రాజ్‌ సుబ్రమణ్యం ఉద్దేశపూర్వకంగా అమెరికన్లను జాబ్ నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలను కంపెనీ ఖండించినప్పటికీ.. ఆన్‌లైన్ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.

ALSO READ : లండన్ లో హైడ్రామా

స్టాప్ ఏఏపీఐ హేట్, మూన్‌షాట్ సంస్థల డేటా ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాసియా వాసులపై హింసాత్మక బెదిరింపులు 12 శాతం పెరిగాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో వారిపై జాత్యహంకార దూషణలు ఏకంగా 69 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోని మొత్తం హెచ్-1బి వీసా దారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే కావడంతో ట్రంప్ తెచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ నేరుగా మనవారిపైనే ప్రభావం చూపుతున్నాయి.

సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త వీసా రూల్స్ ప్రకారం.. హెచ్-1బీ దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెరిగింది. అలాగే ఫిబ్రవరి నుండి అత్యధిక వేతనం పొందే దరఖాస్తుదారులకే ప్రాధాన్యత ఇచ్చేలా సెలక్షన్ సిస్టమ్‌ను మార్చారు. అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ నిర్ణయమని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఇది భారతీయులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉందని విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు 'ప్రాజెక్ట్ ఫైర్ వాల్' పేరుతో వీసా మోసాలపై జరుగుతున్న దర్యాప్తుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

ALSO READ : నిమిషం లేటయితే అరగంట జీతం కట్..

ఇప్పటివరకు అమెరికాలో 'మోడల్ మైనారిటీ'గా గుర్తింపు పొందిన భారతీయులు.. ప్రస్తుతం రాజకీయ, సాంస్కృతిక దాడులకు గురవుతున్నారు. కంపెనీలు కూడా రాజకీయ ఒత్తిడి వల్ల దీపావళి వంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేసేందుకు, జాత్యహంకార దాడులను బహిరంగంగా ఖండించడానికి వెనుకాడుతున్నాయి. అయితే వివేక్ రామస్వామి వంటి కొందరు నేతలు ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. ఒక అమెరికన్ కంటే మరో అమెరికన్ ఎక్కువ అనే ఆలోచన 'అమెరికన్ విలువలకే విరుద్ధం' అన్నారు. ఏది ఏమైనా.. అమెరికాలో భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు డైలమాలో పడిందనేది ఒప్పుకోక తప్పని వాస్తవం.