కేరళలో ఇద్దరు యువ అథ్లెట్లు ఆత్మహత్య.. హాస్టల్‎లో ఒకే రూమ్‎లో ఉరి వేసుకుని సూసైడ్

కేరళలో ఇద్దరు యువ అథ్లెట్లు ఆత్మహత్య.. హాస్టల్‎లో ఒకే రూమ్‎లో ఉరి వేసుకుని సూసైడ్

తిరువనంతపురం: ఇద్దరు టీనేజ్ అథ్లెట్లు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో చోటు చేసుకుంది. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను కోజికోడ్ జిల్లాకు 17 ఏళ్ల సాండ్రా, తిరువనంతపురం జిల్లాకు చెందిన వైష్ణవి (15) గా గుర్తించారు. ఇద్దరూ క్రీడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్‎లో ఉంటున్నారు. 

రోజు మాదిరిగా గురువారం (జనవరి 15) ఉదయం ట్రైనింగ్‎ సెషన్‎కు రాకపోవడంతో అధికారులు వీరి గదికి వెళ్లి చూశారు. డోర్లు క్లోజ్ చేసి ఉండటంతో ఎంత సేపు పిలిచినా ఎటువంటి రెస్పాన్ రాలేదు. దీంతో గది తలుపులు బద్దలుకొట్టి చూసేవరకు ఇద్దరు రూమ్‎లో సీలింగ్ ఫ్యాన్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

ALSO READ : హైకోర్టులోనే తేల్చుకోండి

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువ అథ్లెట్ల ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. హాస్టల్‎లో సాండ్రా, వైష్ణవి వేర్వురు రూముల్లో ఉంటారని.. కానీ బుధవారం (జనవరి 14) రాత్రి వైష్ణవి సాండ్రా రూముకు వెళ్లినట్లు గుర్తించామన్నారు.

 వైష్ణవి సాండ్రా రూముకు ఎందుకు వెళ్లింది..? ఒకే గదిలో ఇద్దరూ ఎందుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదని.. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఏదైనా క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. ఒకేసారి ఇద్దరు యువ అథ్లెట్లు క్యాంపస్‎లో ఉరి వేసుకుని చనిపోవడం కేరళలో సంచలనంగా మారింది.