
ప్రైవేటు కాలేజీల ఫీజుల దాహానికి మరొక విద్యార్థి బలి అయ్యారు. సర్టిఫికేట్స్ ఇవ్వలేదని ఆత్యహత్యాయత్నం చేసిన ఎస్సార్ గాయత్రి కాలేజ్ విద్యార్థి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆదిబట్ల ఎస్సార్ గాయత్రి కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి న అంజిత్... సర్టిఫికెట్ల కోసం 40 వేలు కట్టాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేసిందని పేరెంట్స్ తెలిపారు. ఐతే 40 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనా 15రోజుల తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పిందన్నారు.
సర్టిఫికెట్లు లేకపోవడంతో ఇప్పటికే మొదటి కౌన్సెలింగ్ లో హాజరుకాలేకపోయిన అంజిత్... రెండో విడత కౌన్సెలింగ్ కూడా హాజరు కాలేనన్న మనస్తాపంతో రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఇవాళ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చనిపోయాడు. అంజిత్ కుటుంబ సభ్యులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడారు. అండగా ఉంటామని చెప్పారు. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తన కొడుకు మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.