స్పౌజ్ ​బదిలీలు లేక సతమతం

స్పౌజ్ ​బదిలీలు లేక సతమతం

రాష్ట్రంలో అనేక రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో స్పౌజ్ బదిలీల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయ దంపతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వు నెంబర్ 317 ద్వారా బదిలీ అయి వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ దంపతులకు సంబంధించి స్పౌజ్ బదిలీలపై విద్యాశాఖ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో, పిల్లలు ఎవరితో ఉండాలో, ఎక్కడ చదువుకోవాలో, వారు ఏ జిల్లా పరిధిలోకి వస్తారో తెలియని మానసిక ఒత్తిడిలో స్పౌజ్ ఉపాధ్యాయులు నలిగిపోతున్నారు. నూతన జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం నిరుడు డిసెంబర్ లో క్యాడర్ వారీగా ఉపాధ్యాయులను సీనియార్టీ ఆధారంగా బదిలీలు చేసింది. ఈ క్రమంలో దాదాపు 5000 మంది భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు.19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం13 జిల్లాలను బ్లాక్ లో పెట్టడంతో దాదాపు 2069  మంది ఉపాధ్యాయులు గత 8 నెలలుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వం కనికరించడం లేదు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేస్తే వాటి ఫలితాలు బాగుంటాయి కాబట్టి మానవత్వంతో అన్ని జిల్లాల్లో స్పాజ్ బదిలీలు జరపాలన్న ముఖ్యమంత్రి మాట నెరవేరడం లేదు.

నేను ఇక్కడ.. నువ్వు అక్కడ.. పిల్లలు ఎక్కడ?

13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు జరగకుండా బ్లాక్ లో పెట్టడంతో ప్రస్తుతం భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో, వారి పిల్లలు కుటుంబ సభ్యులతో ఇంకో జిల్లాలో జీవిస్తున్నారు. స్పౌజ్ బాధితుల్లో సింహం భాగం మంది మహిళా ఉపాధ్యాయులు ఉండటం వీరిలో అధిక శాతం మందికి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు.  ఈ మహిళా ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం 4 –-5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 100 నుంచి -300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తూ రాత్రి 8 లేదా -9 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో వారి పిల్లల ఆలన పాలన చూసేవారు కరువయ్యారు. అలాగే ఆరోగ్యం సరిగా లేని వృద్ధ తల్లిదండ్రులు, అత్తమామలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని వదిలి వేరుగా ఉండలేక రోజూ దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉద్యోగం చేయాల్సి రావడంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురవుతున్నారు. కుటుంబంతో మనశ్శాంతిగా ఉండలేకపోవడం, దూర ప్రయాణం వల్ల అలసట వెరసి బోధన సామర్థ్యం, నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్యను పరిష్కరించాలని వివిధ రూపాల్లో వేడుకుంటున్నా, వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఎక్కువ మంది స్పౌజ్ బాధితులు ఉన్న హనుమకొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉన్నా కూడా విద్యాశాఖ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఒంటరి మహిళలు, వితంతువులది మరో సమస్య. ప్రత్యేక కేటగిరీలో వారికి అవకాశం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు తగిన చర్యలు తీసుకోలేదు.

రిక్రూట్​మెంట్​సమస్యను చూపి..

ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేస్తూ నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2018 ఆగస్టు 29న వెలువడగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ 128 విడుదల చేసి 33 జిల్లాలతో కూడిన నూతన జోనల్ వ్యవస్థ ఏప్రిల్ 2021నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల వారీగా పోస్టుల లోకల్ క్యాడర్ క్లాసిఫికేషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. సీనియార్టీ ప్రాతిపదికన తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న 317 ఉత్తర్వులను  అమల్లోకి తెచ్చి అలకేషన్ ప్రక్రియ పూర్తి చేసింది. ఈ సందర్భంలో ఉపాధ్యాయ, ఉద్యోగ దంపతులు ఒకే జిల్లాలో పనిచేయాలనే తలంపుతో ప్రభుత్వం మెమో నంబర్1655 విడుదల చేసింది. దీనికి అనుగుణంగా19 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 2400 స్పౌజ్ బదిలీలు విద్యాశాఖ పూర్తిచేసింది. కానీ మిగతా13 జిల్లాల్లో దరఖాస్తులు ఎక్కువ, ఖాళీలు తక్కువ ఉన్నాయి. రిక్రూట్​మెంట్ సమస్య తలెత్తుతుందని సాకు చూపి అక్కడ బదిలీల కౌన్సెలింగ్ జరపకుండా13 జిల్లాలను బ్లాక్ చేసింది. దీంతో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, హనుమకొండ, ఖమ్మం, సిద్దిపేట, పాలమూరు, మంచిర్యాల, సూర్యాపేట్ జిల్లాల్లో దాదాపు 2069 ఉపాధ్యాయ దంపతుల గోడు పట్టించుకునే వారే కరువయ్యారు.

కొనసాగుతున్న ఆందోళనలు

భర్త ఒక జిల్లా భార్య మరో జిల్లాలో విధుల్లో ఉండటం వలన పిల్లల ఆలన పాలన చూసేవారు లేరు. వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తీవ్ర మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారు. విధి నిర్వహణలో విద్యాబోధనలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న స్పౌజ్ ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య పద్ధతిలో వివిధ రూపాల్లో తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గత పది నెలలుగా వారు చేస్తున్న పోరాటం వారి మానసిక ఆవేదనకు అద్దం పడుతున్నది. ఉపాధ్యాయ సంఘాలకు ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వడం. మంత్రులకు విన్నపాలు, బదిలీల కోసం రక్షాబంధన్, బతుకమ్మ సంబరాలు, బోనాలు, శాంతియుత ర్యాలీలు, ఉపాధ్యాయ దినోత్సవం రోజు మౌన దీక్షలు, ఇంద్ర పార్క్ వద్ద ధర్నాలు.. ఇలా అనేక రూపాల్లో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మోమో నెంబర్ 1655 కు అనుగుణంగా ఇప్పటికైనా వారి ఆందోళనను అర్థం చేసుకొని ప్రభుత్వం 13 జిల్లాల్లో నిలిచిపోయిన స్పౌజ్ బదిలీలను వెంటనే చేపట్టాలి. - అంకం నరేష్, రాష్ట్ర కో కన్వీనర్​, యూఎఫ్​ ఆర్​టీఐ