ఆర్కిటిక్‌‌ ఓపెన్‌‌లో అన్మోల్‌‌ సంచలనం..

ఆర్కిటిక్‌‌  ఓపెన్‌‌లో అన్మోల్‌‌ సంచలనం..

న్యూఢిల్లీ: ఇండియా షట్లర్‌‌ అన్మోల్‌‌ ఖర్బ్‌‌.. ఆర్కిటిక్‌‌  ఓపెన్‌‌లో సంచలనం సృష్టించింది. మంగళవారం (అక్టోబర్ 07) జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో అన్మోల్‌‌ 23–21, 11–21, 21–18తో వరల్డ్‌‌ 21వ ర్యాంకర్‌‌, ఆరోసీడ్‌‌ లిన్‌‌ సియాంగ్‌‌ టి (చైనీస్‌‌తైపీ)పై గెలిచింది. గంటా 17 నిమిషాల మ్యాచ్‌‌లో సియాంగ్‌‌ నుంచి అన్మోల్‌‌కు గట్టి పోటీ ఎదురైంది. 

తొలి గేమ్‌‌లో 13–13తో స్కోరు సమమైన తర్వాత వరుసగా ఐదు పాయింట్లు నెగ్గిన అన్మోల్‌‌ ఆ తర్వాత వెనకబడింది. స్మాష్‌‌లతో హడలెత్తించిన సియాంగ్‌‌ 21–20 ఆధిక్యంలో నిలిచింది. కానీ రెండు బలమైన క్రాస్‌‌ కోర్టు విన్నర్లు కొట్టిన ఇండియన్‌‌ ప్లేయర్‌‌ గేమ్‌‌ను సాధించింది. అయితే రెండో గేమ్‌‌లో బలంగా పుంజుకున్న సియాంగ్‌‌.. అన్మోల్‌‌కు ఎక్కడా చాన్స్‌‌ ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధించి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌‌ నువ్వా–నేనా అన్నట్లుగా సాగింది. స్కోరు 15–15 వద్ద అన్మోల్‌‌ రెండ్రెండు పాయింట్లతో ముందుకు సాగింది. 

చివరకు 19–17 వద్ద సియాంగ్‌‌ ఒక్క పాయింట్‌‌ గెలవగా అన్మోల్‌‌ రెండు పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ తొలి రౌండ్‌‌లో ఎనిమిదో సీడ్‌‌ ధ్రువ్‌‌ కపిల–తనీషా క్రాస్టో 21–9, 21–7తో లుకాస్‌‌ రెనోయిర్‌‌–కామిల్లా పోగ్నాటి (ఫ్రాన్స్‌‌)పై గెలిచారు. 23 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ ద్వయం బలమైన స్మాష్‌‌లు, ర్యాలీలతో అదరగొట్టింది. వరుసగా పాయింట్లు గెలిచి ప్రత్యర్థులకు కోలుకునే చాన్స్‌‌ కూడా ఇవ్వలేదు. మరో మ్యాచ్‌‌లో మోహిత్‌‌ జగ్లాన్‌‌–లక్షిత జగ్లాన్‌‌ 19–21, 15–21తో బ్రియాన్‌‌ వాస్నిక్‌‌–డెబోరా జిలీ (నెదర్లాండ్స్‌‌) చేతిలో ఓడారు.