ప్రభుత్వం చేసిన తప్పుకు మేం బలవుతున్నాం

ప్రభుత్వం చేసిన తప్పుకు మేం బలవుతున్నాం
  • ఎక్కడ పని చెయ్యమంటే అక్కడ చేయాలని మంత్రి ఫైర్‌‌ అయ్యారన్న ఏఎన్‌ఎంలు
  • ప్రభుత్వం చేసిన తప్పుకు తాము బలవుతున్నామని ఆవేదన
  • అసలు ఆప్షన్ పెట్టుకోని జోన్‌కు బదిలీ చేశారని ఆరోపణ 

సంగారెడ్డి, వెలుగు: సమస్య చెప్పుకుందామని వచ్చిన తమపై హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు ఫైరయ్యారని, బదిలీల్లో అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వస్తే  అసహనం వ్యక్తం చేశారని ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. జోన్ల వారీగా ఉద్యోగుల విభజనలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న తమను ఆరో జోన్ కు బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నామని, కానీ, మూడో జోన్ కు బదిలీ చేశారని అన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించేందుకు వచ్చిన హరీశ్​ను కలిసి విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నించామన్నారు.  ‘‘అసలు మేం మూడో జోన్ ఆప్షనే ఇవ్వకుండా, అక్కడికి ఎలా బదిలీ చేస్తారు? మాకు న్యాయం చేయాలి” అని కోరుతూ ఏఎన్ఎంలు మంత్రికి వినతిపత్రం ఇచ్చామని, దాన్ని చింపేసి తమ చేతుల్లోనే పెట్టారని వాపోయారు. ‘‘ఎక్కడ పని చెయ్యమంటే అక్కడ చెయ్యాలి” అంటూ కోప్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రాన్ని తీసుకొని, ‘‘చూస్తామని” చెప్పినా బాగుండేదన్నారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము ఆప్షన్ ఇవ్వని జోన్ కు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు తాము బలైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.