పోటెత్తిన పల్లె ఓటర్లు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత భారీగా పోలింగ్

పోటెత్తిన పల్లె ఓటర్లు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత భారీగా పోలింగ్
  •  గద్వాల జిల్లాలో అత్యధికంగా 87.08 శాతం
  •  వనపర్తిలో 87  శాతం , 
  • పాలమూరులో 86.62, 
  • నారాయణపేటలో 84.33, 
  • నాగర్​కర్నూల్​లో 84  శాతం నమోదు

మహబూబ్ ​నగర్/గద్వాల/వనపర్తి/ నాగర్​కర్నూల్​,వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ పోలింగ్​కు ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొలింగ్​కొనసాగగా.. చలి ప్రభావం వల్ల మొదటి రెండు గంటలు మందకొడిగా సాగింది.  ఆ తర్వాత పుంజుకుంది. ఓటర్లు క్యూలైన్లలో బారులుతీరి ఓటేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా.. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 

నారాయణపేట జిల్లాలో..

జిల్లాలోని దామరగిద్ద, నారాయణ పేట, ధన్వాడ, మరికల్ మండలాల్లోని 85 సర్పంచ్, 1,065 వార్డు స్థానాలకు పోలింగ్​జరిగింది. మొత్తం1,50,318 ఓటర్లు ఉండగా.. 1,26,769 ఓట్లు పోలయ్యాయి. దామరగిద్ద మండలంలో 33,925 మంది, ధన్వాడ మండలంలో 24,659 మంది, మరికల్ మండలంలో 28,381 మంది, నారాయణపేట మండలంలో 39,804 మంది ఓటు వేశారు. జిల్లాలో మొత్తం 84.33 శాతం పోలింగ్ నమోదైంది. 

జోగులాంబ గద్వాల జిల్లాలో..

జిల్లాలోని అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో 87.08 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్​కేంద్రాలను కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళలు, పురుషులు, ట్రాన్స్​జెండర్స్ మొత్తం 98,234 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయిజ మండలంలో పురుషులు 17,448 మంది, మహిళలు 17,557 మంది, ట్రాన్స్ జెండర్స్ ముగ్గురు ఓటు వేశారు. 

మల్దకల్ మండలంలో పురుషులు 16,434 మంది, మహిళలు 16,791 మంది, రాజోలి మండలంలో పురుషులు 11,903 మంది, మహిళలు 11,576 మంది, వడ్డేపల్లి మండలంలో పురుషులు 3,301 మంది, మహిళలు 3,217 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయిజ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో ఏజెంట్ల పాసుల జారీ విషయంలో సర్పంచ్ బరిలో ఉన్న ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక వర్గానికి మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్​పాసులు ఇచ్చారని మరో వర్గం వారు ఆరోపించారు. ఉండవెల్లి ఎస్సై శేఖర్ జోక్యం చేసుకొని వారిని శాంతింపజేశారు. అనంతరం ఆర్వో రెండో వర్గానికి కూడా పాసులు ఇవ్వడంతో ఓటింగ్ ప్రారంభమైంది. 

  వనపర్తి జిల్లాలో..

జిల్లాలో వనపర్తి, మదనాపూర్, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో కలిసి మొత్తం 87 శాతం పోలింగ్​నమోదైంది. మొత్తం 94 పంచాయతీలకు గానూ 5 ఏకగ్రీవం కాగా.. 89 సర్పంచ్​స్థానాలకు, 850 వార్డు స్థానాలకు గానూ 148 ఏకగ్రీవం కాగా 702 వార్డులకు పోలింగ్​జరిగింది. 

మొత్తం 1,18, 792 మంది ఓటర్లుండగా, 1,03,406 మంది ఓటు వేశారు. వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లి పోలింగ్ సెంటర్​కు సంబంధించి వార్డు బ్యాలెట్​పేపర్​లో 8వ వార్డు అభ్యర్థి పేరు ఉండి, గుర్తు లేదు. ఈ విషయాన్ని 50 ఓట్లు పోలైన తర్వాత గుర్తించిన అధికారులు పోలింగ్​ఆపి, బ్యాలెట్​పేపర్లను తెప్పించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్ కంట్రోల్​ రూమ్​లో వెబ్​ కాస్టింగ్​ను పరిశీలించారు.  

  నాగర్ కర్నూల్ జిల్లాలో..

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం పోలింగ్​నమోదైంది. బిజినేపల్లి, నాగర్ కర్నూల్, తిమ్మాజిపేట, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి మండలాల్లోని 147 గ్రామాల్లో  473 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. 1,412 వార్డులకు గానూ 143 వార్డులు ఏకగ్రీవం కాగా.. 1,269 వార్డులకు 3,228 మంది పోటీలో ఉన్నారు.  తిమ్మాజిపేట మండలంలోని అవంచ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్​మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అనుచరులు దాడి చేసుకున్నారు. జనార్దన్​ రెడ్డి అనుచరులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని గొడవ జరిగింది. 

పలువురికి గాయాలు కాగా జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. ఆయా మండలాల్లో మొత్తం 2,50,239 మంది ఓటర్లు ఉండగా.. 2,10,151 ఓట్లు పోలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్​తెలిపారు. బిజినపల్లి  మండలంలో 49,582 మంది, నాగర్ కర్నూల్  మండలంలో 29,282, తిమ్మాజిపేట మండలంలో 26,253  మంది, కొల్లాపూర్ మండలంలో, 24, 924 మంది,  పెంట్లవెల్లి మండలంలో 15,448, కోడేరు  మండలంలో 24,339, పెద్దకొత్తపల్లి  మండలంలో 40,323 మంది ఓటు వేశారు.  

మహబూబ్​నగర్ జిల్లాలో..

జిల్లాలోని హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్​కొండ, కౌకుంట్ల, మిడ్జిల్​ మండలాల్లోని 142 సర్పంచ్, 1,065 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 1,85,040 మంది ఓటర్లు కాగా.. 1,60,284 ఓట్లు పోలయ్యాయి. హన్వాడ మండలంలో మొత్తం 40,121 మంది ఓటర్లకు గానూ 35,116 మంది, చిన్నచింతకుంటలో 31,056 మందికి గానూ 26,292 మంది, దేవరకద్రలో 24,868 మందికి గానూ 22,152 మంది, కోయిల్​కొండలో 49,450 మందికి గానూ 41,869 మంది, కౌకుంట్లలో 14,417  మందికి గానూ 12,424 మంది, మిడ్జిల్​లో 25,128 మందికి గానూ 22,431 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 86.62 శాతం పోలింగ్​నమోదైంది.