డబ్బుకు ఆశపడి కేజ్రావాల్ చిక్కుల్లో పడ్డరు: అన్నా హజారే

డబ్బుకు ఆశపడి కేజ్రావాల్ చిక్కుల్లో పడ్డరు: అన్నా హజారే

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ అంశానికి దూరంగా ఉండాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తాను చాలా సార్లు హెచ్చరించానని, కానీ ఆయన డబ్బుకు ఆశపడి కొత్త పాలసీని తెచ్చారని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మద్యం పాలసీని తయారు చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన కేజ్రీవాల్ అరెస్ట్ అంశంపై మీడియాతో మాట్లాడారు. "కేజ్రీవాల్ గతంలో నాతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా పోరాడారు. అలాంటిది ఇప్పుడు ఆయనే లిక్కర్ పాలసీని తీసుకొచ్చి చిక్కుల్లో పడ్డారు. ఆయన అరెస్టు కావడం చాలా బాధగా ఉంది. కానీ, ఇప్పుడేం చేయగలం. చట్టం ప్రకారం ఏది జరిగినా ఎదురుచెప్పలేం" అని హజారే తెలిపారు. 2011లో హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈ పోరాటం నుంచే ఆప్ ఆవిర్భవించింది. 

హజారే మాత్రం మొదటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పలు అంశాల్లో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కానీ, ఆయనకు కేజ్రీవాల్, ఆప్ నేతలు ఎలాంటి కౌంటర్లు ఇచ్చేవారు కాదు. ఢిల్లీ లిక్కర్ పాలసీని అన్నాహజారే గతంలోనూ వ్యతిరేకించారు. పాలసీపై తన ఆవేదనను వివరిస్తూ 2022లో సీఎం కేజ్రీవాల్ కు లెటర్ కూడా రాశారు. " మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను రాస్తున్న మొదటి లేఖ ఇది. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ గురించి తెలిసి బాధనిపించింది. మద్యం లాగానే అధికారం కూడా మత్తునిస్తుంది. మీరు అధికారమనే మత్తులో ఉన్నట్లు కనిపిస్తోంది” అని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఆ లేఖ వైరల్ అవుతోంది.కాగా..కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ, పలు విపక్ష పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో హజారే కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

కర్మ వెంటాడుతున్నది

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రావాల్ ను కర్మ వెంటాడుతున్నదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ అన్నారు. ఢిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ పై  కేజ్రీవాల్, అన్నా హజారే బృందం గతంలో బాధ్యతారహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఆ పాపానికి పర్యవసానాలను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారని..'కర్మ వెంటాడుతున్నది' అని ఆమె ట్వీట్ చేశారు.