డిసెంబర్ నుంచి నిలిచిపోనున్న అన్నదాత మాసపత్రిక

డిసెంబర్ నుంచి నిలిచిపోనున్న అన్నదాత మాసపత్రిక

5 దశాబ్దాలకుపైగా రైతులకు వ్యవసాయ సమాచారం అందించిన అన్నదాత మాసపత్రిక నిలిచిపోనుంది. డిసెంబర్ నుంచి పత్రిక ప్రచురణ నిలిపివేస్తున్నట్లు అన్నదాత మాసప్రతిక ఎడిటర్ అమిర్నేని హరికృష్ణ ప్రకటించారు. ఐదు దశాబ్దాలుగా విజయవంతంగా నడిచిన ఈ పత్రిక డిజిటల్ మీడియా ధాటికి నిలబడలేకపోతున్నట్లు తెలుస్తోంది. మాసపత్రిక ఆగిపోయినా.. సాగుబడికి సంబంధించిన సమాచారాన్ని ఈటీవీలో ప్రసారమవుతున్న అన్నదాత కార్యక్రమం ద్వారా అందిస్తామని హరికృష్ణ స్పష్ట ంచేశారు.

‘‘సుమారు ఐదున్నర దశాబ్దాల నిరంతర రైతు సేవకు 'అన్నదాత' మాసపత్రిక నిదర్శనంగా నిలిచింది. సాగుదార్లకు అండగా నిలవాలనే ఆలోచనతో 1969 జనవరిలో అన్నదాత మాసపత్రిక ఆవిర్భవించింది. గ్రామీణ రైతుకు విత్తనాల నుంచి మార్కెట్ల వరకు, పరిశోధనశాల నుంచి పంట పొలాల వరకు సశాస్త్రీయ సమాచారాన్ని క్రోడీకరించి సకాలంలో చేరవేసింది. సాగు ఖర్చులు తగ్గించే ఉపాయాలు, ఉత్పత్తిని రెట్టింపు చేసే మార్గాలపై సమస్త సమాచారాన్నీ ప్రోది చేసి ఇచ్చింది. ఉత్పత్తికి విలువ జోడించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలపై నివేదికలనూ అందించింది. తద్వారా రైతులే కాదు నిరుద్యోగ యువతకూ జీవితంపై భరోసా పెంపొందించగలిగింది. పంటలతో పాటు పశుపోషణ, కోళ్లు, జీవాల పెంపకం, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం, మత్స్య, పట్టు పరిశ్రమల్లో ఆదాయ సముపార్జనకున్న అవకాశాలు, ప్రభుత్వ పథకాల గురించి సమగ్ర సమాచారాన్ని బోనస్ పుస్తకాలు, డైరీల రూపంలో ఉచితంగా అందించింది. స్థిరమైన ఆదాయం పొందాలంటే నైపుణ్యాన్ని పెంచుకుంటూ సేద్యాన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దుకోవాల్సిన అంశాలపై రైతులకు ఒక దిక్సూచిలా తోడ్పడింది. వ్యవసాయ విద్య, పరిశోధనల తీరుతెన్నులు, శాస్త్రవేత్తలు – రైతులకు మధ్య వారధిలా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ ఉపకరించే సమాచారంతో అన్నదాత సాగుదార్ల శ్రేయం కోసం నిరంతర యజ్ఞం చేసింది.

డిజిటల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం క్షణాల్లో అందరికీ చేరుతోంది. పాఠకుల అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు వస్తున్నాయి. డిజిటల్ మీడియా ప్రభంజనంతో మాసపత్రికల అవసరం క్రమేణా తగ్గుతోంది. ప్రతి వ్యవస్థకూ కాలం చెల్లినట్టే అన్నదాత మాసపత్రిక అవసరమూ తగ్గిపోతోంది. తాజా సాగు సమాచారం క్షణాల్లో డిజిటల్ మాధ్యమాల ద్వారా గడప గడపను తాకుతోంది. ఈ మార్పులకు తగ్గట్టు ఆధునిక సాంకేతిక సమాచారాన్ని ఈటీవీలో ప్రసారమవుతున్న అన్నదాత కార్యక్రమం ద్వారా రైతులకు ఏ రోజు కారోజు అందిస్తున్నాం. కర్షకుల ప్రతి అడుగులో నిజమైన నేస్తంలా వెన్నంటి నిలిచి. రైతు సేవలను ఒక యజ్ఞంలా శ్వాసించిన అన్నదాత మాసపత్రికను ఈ డిసెంబరు సంచికతో నిలిపివేస్తున్నాం. యాభై నాలుగేళ్ల పాటు 'అన్నదాత' అక్షర సేద్యానికి ఆప్తమిత్రులుగా అండగా నిలిచిన మీ కృషికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం’’ అని అమిర్నేని హరికృష్ణ అన్నారు.