కిరాతకులు : పోలీస్ను చంపేసిన ఎర్ర చందనం స్మగ్లర్లు

కిరాతకులు : పోలీస్ను చంపేసిన ఎర్ర చందనం స్మగ్లర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్లు రెచ్చిపోయారు.. ఏకంగా పోలీసులపై నుంచి స్మగ్లర్ల ఎర్రచందనం వాహనాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  

అన్నమయ్య జిల్లాలో  సోదాలు నిర్వహిస్తుండగా.. ఎర్రచందనం స్మగ్లర్లు ఓ కానిస్టేబుల్‌ను హత్య చేశారు. కెవి పల్లె మండలం చీనేపల్లి గ్రామంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి(ఫిబ్రవరి 05) సోదాలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ  కానిస్టేబుల్ ఎర్రచందనం తీసుకెళ్తున్న కారును ఆపమని డ్రైవర్‌ కు సిగ్నల్ ఇచ్చాడు. అయితే కారును ఆపకుండా స్మగ్లర్లు అతడిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడు. కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) 14వ బెటాలియన్‌కు చెందిన గణేష్‌గా గుర్తించారు.

ఈ ఘటన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. కారుతో పాటు ఇద్దరు స్మగ్లర్లను పట్టుకుని ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు. కారులో ఉన్న 7 ఎర్ర చందన దుంగలను పోలీసులు సీజ్ చేశారు.