భూ విస్తీర్ణం పెరగలే.. పట్టాదారులు పెరిగిన్రు

భూ విస్తీర్ణం పెరగలే.. పట్టాదారులు పెరిగిన్రు
  • భూ విస్తీర్ణం పెరగలే.. పట్టాదారులు పెరిగిన్రు
  • ఏడాదిలో కొత్త పట్టాదారులు 2,47,822 మంది
  • రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనే ఎక్కువ
  • ఫామ్ ల్యాండ్ వెంచర్లతో ఏటా పెరుగుతున్న పాస్ బుక్స్ సంఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పట్టాదారు పాస్ బుక్స్ కలిగినోళ్ల సంఖ్య ఏటేటా లక్షల్లో పెరుగుతోంది. కొత్తగా రికార్డుల్లో నమోదు చేస్తున్న భూమి విస్తీర్ణం వేల ఎకరాల్లో పెరిగితే.. పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్య లక్షల్లో పెరగడం విశేషం. ఫామ్ ప్లాట్ల కొనుగోళ్లు, కుటుంబాల్లో పంపకాలతో పట్టాదారు పాస్ బుక్స్ సంఖ్య పెరుగుతున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 2018లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయినప్పుడు 50.25 లక్షలు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్య, తాజాగా 70.53 లక్షలకు చేరింది. నాలుగేండ్లలో కొత్త పట్టాదారుల సంఖ్య సుమారు 20 లక్షలకుపైగా పెరిగింది. రైతు బంధు లెక్కల ప్రకారం.. నిరుడు వానాకాలంలో 60.84 లక్షల మంది పట్టాదారుల చేతుల్లో కోటి 47 లక్షల 21 వేల ఎకరాలు ఉంటే, అదే ఏడాది యాసంగికి 63 లక్షల మంది వద్ద కోటి 48 లక్షల 23 వేల ఎకరాలు ఉంది. ఈ ఏడాది వానాకాలంలో 64 లక్షల 99 వేల మంది చేతుల్లో కోటి 48 లక్షల 66 వేల ఎకరాల భూములు ఉన్నాయి. గడిచిన ఏడాదిలో కొత్తగా 2,47,822 మంది పట్టాదారు పాస్ బుక్స్ పొందినట్లుగా రెవెన్యూ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. 

ఫామ్‌‌ ల్యాండ్స్‌‌ పేరిట అమ్మకాలు.. 

రాష్ట్రంలో రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనే ఈ ఏడాది ఎక్కువగా కొత్తవాళ్లకు పట్టాదారు పాస్ బుక్స్ జారీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 22,015 మందికి, సంగారెడ్డి జిల్లాలో 21,576 మందికి, నల్గొండ జిల్లాలో 15,881 మందికి, సిద్దిపేట జిల్లాలో 14,523, వికారాబాద్ జిల్లాలో 13,945, మెదక్ జిల్లాలో 11,706 మందికి పాస్ బుక్స్ జారీ అయ్యాయి. రాష్ట్రంలో అత్యంత తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,445, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌లో 2,368 మందికి పాస్ బుక్స్ జారీ అయ్యాయి. హైదరాబాద్ చుట్టు పక్కల రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో వ్యవసాయ భూములను ఫామ్ ల్యాండ్ వెంచర్లుగా చేసి గుంటల్లో అమ్ముతున్నారు. ఒక్కో ఎకరంలో రోడ్లు పోను 25 నుంచి 30 గుంటల వరకు ఫామ్ ప్లాట్ల చొప్పున అమ్మకాలు చేపట్టడంతో పాస్ బుక్స్ సంఖ్య వేలల్లో పెరుగుతున్నట్లు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్ వెల్లడించారు. సాదాబైనామాలు, వివిధ కారణాలతో హక్కులు తేల్చని భూములకు పట్టాదారు పాస్ బుక్స్ జారీ చేస్తే వీటి సంఖ్య 85 లక్షలు దాటే అవకాశముందని చెబుతున్నారు.