
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ ఏడాది రాష్ట్రంలో మూడు కొత్త ప్రైవేటు మెడికల్ కాలేజీలు, రెండు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది. వరంగల్‌లోని ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం వంద సీట్లు ఉండగా, ఈ ఏడాది అదనంగా మరో 50 సీట్లకు పర్మిషన్ ఇచ్చింది.
ఆర్‌వీఎం మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉండగా, అదనంగా మరో వంద సీట్లకు పర్మిషన్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఏడు కాలేజీల్లో కలిపి 850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 7,465కు పెరిగింది. ఇందులో 3,015 సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండగా, 4,450 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. మరో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాల్సి ఉంది.
ఒక్కో కాలేజీలో వంద సీట్లు ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఎన్‌ఎంసీకి విజ్ఞప్తి చేసింది. వీటిల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తయ్యాయని, అన్ని కాలేజీలకు తప్పకుండా పర్మిషన్ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అంటే ఈ ఏడాదే మరో 700 సీట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి వస్తే మొత్తం సీట్ల సంఖ్య 8,165కు చేరుతుంది.
రెండేండ్లలోనే 3 వేల సీట్లు
ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి 2021 నాటికి 5,040 సీట్లు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీను ఏర్పాటు చేసింది. వీటిల్లో 1,150 సీట్లు అందుబాటులోకి రాగా, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 375 సీట్లు వచ్చాయి. దీంతో గత అకడమిక్ ఇయర్‌లో సీట్ల సంఖ్య 6,615కు చేరింది. ఈ ఏడాది 850 సీట్లు యాడ్ అయ్యాయి. మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెబుతున్నట్టుగా ఇంకో 700 సీట్లు యాడ్ అయితే, రెండేండ్లలోనే 3,125 సీట్లు పెరిగినట్టవుతుంది.
కొత్త కాలేజీల వివరాలు సీట్ల సంఖ్య
- అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ 150
- సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150
- ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 150
- ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ 100
- కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ 100