డోనెట్స్క్ ప్రాంతంపై రష్యా ఫోకస్

డోనెట్స్క్ ప్రాంతంపై రష్యా ఫోకస్

కీవ్/మాస్కో: మరియుపోల్​లోని స్టీల్ ప్లాంటు నుంచి మరో 771 మంది ఉక్రెయిన్ ఫైటర్లను తరలించామని గురువారం రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు స్టీల్ ప్లాంటు నుంచి మొత్తం 1,730 మందిని తరలించినట్లు తెలిపింది. వీరిలో 80 మంది గాయపడిన ఫైటర్లు ఉండగా, వారిని డోనెట్స్క్ ప్రాంతంలోని ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​కు తరలించినట్లు రష్యా చెప్పింది. అయితే ఉక్రెయిన్​కు చెందిన అజోవ్ రెజిమెంట్​ను రష్యా టెర్రరిస్ట్ సంస్థగా పేర్కొంటోంది. ఆ యూనిట్​కు చెందిన సోల్జర్లను  అజోవ్ నేషనలిస్ట్ యూనిట్ మిలిటెంట్లుగా ప్రస్తావిస్తోంది. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని కీలకమైన మరియుపోల్​ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న రష్యా.. తూర్పు ఉక్రెయిన్ లోని డోనెట్స్క్ ప్రాంతంపై మరింతగా ఫోకస్ పెంచింది. షెల్లింగ్ ను తీవ్రతరం చేసింది. దీంతో డోనెట్స్క్ లో ఎక్కడా సేఫ్ ప్లేస్ లేదని, ప్రజలంతా ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ స్థానిక గవర్నర్ పావ్ లో కిరిలెంకో హెచ్చరించారు. మరోవైపు నాటోలో ఫిన్లాండ్, స్వీడన్ చేరొద్దంటూ టర్కీ వ్యతిరేకిస్తుండటంతో ఆ దేశానికి ఉన్న అభ్యంతరాలను పరిశీలిస్తామని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ చెప్పారు. అలాగే నాటోలో చేరిన తర్వాత కూడా తమ దేశంలో అణ్వాయుధాలను మోహరించబోమని, నాటో మిలిటరీ బేస్​లను ఏర్పాటు చేయబోమని ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ వెల్లడించారు.