పీఎఫ్ఐ కేసులో మరో నిందితుడి అరెస్ట్

పీఎఫ్ఐ కేసులో మరో నిందితుడి అరెస్ట్
  •     రెండేండ్ల క్రితం నిజామాబాద్​లో బయటపడ్డ పీఎఫ్ఐ మాడ్యూల్ 
  •     కేసులో ఇప్పటివరకూ 15 మంది అరెస్ట్ 

హైదరాబాద్‌, వెలుగు : నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో నమోదైన కేసులో మరో కీలక నిందితుడిని శనివారం అరెస్ట్‌ చేసింది. పీఎఫ్‌ఐ నార్త్‌ తెలంగాణ స్టేట్‌ సెక్రటరీగా పనిచేసిన అబ్దుల్‌ సలీంను ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు.

కాగా, దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడేలా ముస్లిం యువతకు పీఎఫ్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారని ఎన్ఐఏ గుర్తించింది.  దీంతో 2022 జులై 7న నిజామాబాద్‌ 6వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పీఎఫ్ఐ నెట్ వర్క్ దేశవ్యాప్తంగా ఉండటంతో ఎన్‌ఐఏ కూడా అదే ఏడాది ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2022 డిసెంబర్‌లో చార్జిషీట్‌లో దాఖలు చేసింది.

అబ్దుల్‌ సలీం సహా మొత్తం11 మంది నిందితుల పేర్లు చేర్చింది. ఆ తర్వాత 2023 మార్చిలో వేసిన అనుబంధ చార్జిషీట్‌లో మరో ఐదుగురు నిందితులను, డిసెంబర్‌లో వేసిన మరో చార్జిషీట్‌లో మరో నిందితుడి పేరును నమోదు చేసింది.  తాజాగా అబ్దుల్‌ సలీంతో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.