- భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్‌ల ధ్వంసానికి బంకర్ బస్టర్ల ప్రయోగం
- పశ్చిమాసియా దాటి ప్రతి దాడులు చేస్తామని వార్నింగ్
- ఇరాన్ కొత్త సంవత్సరం రోజే ఇజ్రాయెల్ దాడులు
వాషింగ్టన్, జెరూసలెం, టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ లోని అత్యంత కీలకమైన నతాంజ్ అణు ఇంధన శుద్ధి కేంద్రంపై శనివారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా వైమానిక దాడులు నిర్వహించాయి. టెహ్రాన్‌కు సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రంపై జరిగిన దాడితో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. గతేడాది జూన్‌లో జరిగిన దాడి తర్వాత, మళ్లీ ఇంతటి భారీ స్థాయిలో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ దాడిలో అమెరికా తన శక్తిమంతమైన ‘బంకర్ బస్టర్’ బాంబులను ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం. నతాంజ్‌లోని ‘షాహిద్ అహ్మదీ రోషన్’ అణు కేంద్రంలో భూగర్భంలోని యురేనియం శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్‌లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘తస్నిమ్’ కూడా ఈ దాడిని ధృవీకరిస్తూ, ఇది అమెరికా, ఇజ్రాయెల్ చేసిన ఉమ్మడి కుట్ర అని మండిపడింది.
రేడియేషన్ లీక్ కాలేదు..
అణు కేంద్రంపై దాడి నేపథ్యంలో రేడియేషన్ ముప్పు పొంచి ఉందని టెన్షన్ నెలకొంది. ప్రస్తుతానికి ఎటువంటి రేడియేషన్ లీక్ జరగలేదని ఇరాన్ అణు శక్తి సంస్థ స్పష్టం చేసింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. నతాంజ్ పరిసరాల్లో రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని తెలిపింది.
దాడిని కన్ ఫర్మ్ చేసిన ఇరాన్
యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన వేళ, తమ ప్రధాన అణు ఇంధన శుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై శనివారం వైమానిక దాడి జరిగినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ దాడి వల్ల ఎటువంటి రేడియేషన్ ముప్పు (లీకేజీ) సంభవించలేదని ఇరాన్ వార్తా సంస్థ ‘మిజాన్’ స్పష్టం చేసింది. గతంలోనూ పలుమార్లు దాడులకు గురైన ఈ కేంద్రంపై, తాజా దాడిలో కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు చెబుతూనే, అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, 3 యుద్ధ నౌకలను పశ్చిమాసియాకు పంపించారు. చమురు ధరలు పెరగడంతో మార్కెట్లను సముదాయించేందుకు ఇరాన్ చమురుపై కొన్ని ఆంక్షలను సడలించినప్పటికీ, యుద్ధ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఇరాన్ నూతన సంవత్సరం ‘నౌరూజ్’ వేడుకల సమయంలోనే రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హం.
పశ్చిమాసియా దాటి దాడులు చేస్తాం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్కులు, వినోద ప్రాంతాలు మరియు పర్యాటక ప్రాంతాలు.. ఇవేవీ తమ శత్రువులకు సురక్షితం కాదని ఇరాన్ అగ్రశ్రేణి సైనిక ప్రతినిధి జనరల్ అబుల్ ఫజల్ షేకర్చీ హెచ్చరించారు. టెహ్రాన్ తన ఒత్తిడి తంత్రంలో భాగంగా పశ్చిమాసియా దాటి దాడులకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళనలను ఈ హెచ్చరికలు మరోసారి రేకెత్తించాయి. మరోవైపు, నౌరూజ్ పండుగ సందర్భంగా ఇరాన్ టెలివిజన్‌లో చదివి వినిపించిన ఒక లిఖితపూర్వక ప్రకటనలో సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ యుద్ధ సమయంలో ఇరాన్ ప్రజలు చూపుతున్న పట్టుదలను ప్రశంసించారు. కాగా, ఫిబ్రవరి 28 నుంచి అమెరికా మరియు ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న భారీ దాడుల వల్ల ఇరాన్ ఆయుధ సంపత్తికి, అణు, ఇంధన కేంద్రాలకు ఎంతమేర నష్టం వాటిల్లిందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే, ఇరాన్ చేస్తున్న దాడులు చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తూ, పశ్చిమాసియా ఆవల కూడా ఆహార, ఇంధన ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి.
హిజ్బుల్లాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున దాడులు చేపట్టినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ప్రభుత్వ వివరాల ప్రకారం.. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 1,000 మందికి పైగా మరణించారు, 10 లక్షలకు పైగా జనం నిరాశ్రయులయ్యారు. ఇరాన్‌లో 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 15 మంది, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో మరో నలుగురు చనిపోయారు. 13 మంది అమెరికా సైనికులు కూడా ఈ పోరులో మరణించారు.
ఎఫ్-16 జెట్ కూల్చేశాం:ఇరాన్
ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్(మూడవది)ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. శనివారం తెల్లవారుజామున 3:45 గంటలకు తమ గగనతలంలోకి ఇజ్రాయెల్ ఎఫ్-16 యుద్ధ విమానం ప్రవేశించిందని.. దాన్ని ఐఆర్జీసీ దళాలు అడ్డుకున్నాయని తెలిపింది. అయితే, ఆ విమానాన్ని కూల్చివేసినట్లు ధ్రువీకరించే ఎలాంటి ఫొటోలు, వీడియో ఆధారాలను ఇరాన్ రిలీజ్ చేయలేదు. ఈ వార్తలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతినిధి తోసిపుచ్చారు. ఇరాన్ తమ ఫైటర్ జెట్‌ను లక్ష్యంగా చేసుకున్న మాట వాస్తవమేనని.. కానీ అది దాడి నుంచి తప్పించుకుని తన మిషన్‌ను విజయవంతంగా కొనసాగించిందని స్పష్టం చేశారు.
