హుజురాబాద్ లో పద్మశాలి భవన్ కు కోటి మంజూరు

హుజురాబాద్ లో పద్మశాలి భవన్ కు కోటి మంజూరు

కరీంనగర్: త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో వరాల వర్షం కురుస్తోంది. తాజాగా పద్మశాలి భవన నిర్మాణానికి స్థలంతోపాటు కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. మంగళవారం  హుజురాబాద్ సిటీ సెంటర్ హాల్ లో పద్మశాలి కులస్థులతో మంత్రి గంగుల, మాజీ మంత్రి ఎల్.రమణ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఉద్యమంలో నేతన్నల చావుల్ని చూసి కేసీఆర్ చలించి పోయారన్నారు. స్వరాష్ట్రంలో బతుకమ్మ చీరలు, నేతన్నకు చేయూత, బీమా, మిత్ర, పావలా వడ్డి వంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చారని వివరించారు. హుజూరాబాద్ లో  ఆత్మగౌరవ భవనం కావాలంటే ఈటల అవహేళన చేశారని, మాజీ మంత్రి ఈటల తన స్వప్రయోజనాల కోసమే ఎన్నికల్ని రుద్దారని మంత్రి ఆరోపించారు. హుజురాబాద్ వెనుకబాటుతనానికి కారకుడు ఈటల అని ఆయన విమర్శించారు. 20ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసాడో పాదయాత్రలో చెప్పమనండి అని ఆయన సవాల్ చేశారు. గ్యాస్ రూ. 2000, పెట్రోల్ లీటర్ రూ.200 చేయడానికి బీజేపీకి ఓటెయ్యాల ? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

సంక్షేమ పథకాలతో తెలంగాణ, సంక్షోభంలో పన్నులతో కేంద్రంలో  బీజేపీ పాలిస్తున్నాయని మంత్రి తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి  ఓటే ఉత్సాహం అని, ప్రజలు ఆలోచించి ఓటేయ్యాలి, అభివృద్ధికి అండగా నిలవాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. మాజీ మంత్రి ఎల్.రమణ మాట్లాడుతూ రాబోయే కాలంలో పద్మశాలీలు మరింత ముందుకెళ్లేవిధంగా చూస్తానన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు ఆత్మగౌరవం ఇనుమడింపజేసేవిధంగా సీఎం నేతృత్వంలో పనిచేస్తానని ప్రకటించారు. మంత్రి హరీశ్ రావు సూచన మేరకు మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పారు. రాబోయే చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి ఎల్.రమణ అన్నారు.