అల్లూరి జిల్లాలో మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు మృతి

అల్లూరి జిల్లాలో మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు మృతి

అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్‌ ఉందని, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు.

ఇంటెలిజెన్స్‌కి పూర్తి సమాచారం ఉండటంతో మంగళవారం ఆపరేషన్‌ చేశామని, మంగళవారం ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో  మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మావోయిస్టు షెల్టర్‌ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయని, 50 మంది మావోయిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశామని తెలిపారు. కోనసీమ, ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణా, ఏలూరు, కాకినాడలో మావోయిస్టులు పట్టుబడ్డారని- ఏపీ ఇంటెలిజన్స్‌ ఏడీజీ మహేష్‌ చంద్ర లడ్డా మీడియాకు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ​డీజీపీ హరీశ్​కుమార్​ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్​చంద్ర లడ్డా పర్యవేక్షణలో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్​ఆధ్వర్యంలో రెండ్రోజుల కింద కూంబింగ్​చేపట్టారు. ఈ క్రమంలోనే హిడ్మా టీమ్ ఏపీలోని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చినట్టుగా గుర్తించి గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుముట్టాయి. 

టైగర్​జోన్​దగ్గర నల్లూరు జలపాతం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తాము జరిపిన ఎదురుకాల్పుల్లో హిడ్మా, అతని భార్య రాజే, డీసీఎం లక్ష్మణ్​, పీపీసీఎం కమ్లూ, పీపీసీఎం మల్లా, హిడ్మా గార్డు దేవే మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. వాళ్ల మృతదేహాలను మారేడుమిల్లి ఆసుపత్రి మార్చురీకి తరలించామని తెలిపారు. 

ఘటనా స్థలంలో రెండు ఏకే 47, ఒక పిస్టల్, రివాల్వర్, సింగిల్​బోర్​తుపాకీ, 25 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్​ఎలక్ట్రికల్​డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్​బండిల్, కెమెరా ఫ్లాష్​లైట్, కటింగ్​బ్లేడ్, 25 మీటర్ల ఫ్యూజ్ వైర్, ఏడు కిట్​బ్యాగులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.