
- సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కసరత్తు..
- ఐదు నెలల్లో1.62 లక్షల కొత్త రేషన్ కార్డులు
- మరో రెండు నెలల్లో
- మరో 70 వేల కార్డుల జారీ
- పెరిగిన కార్డులకు అనుగుణంగా కొత్త షాపులకు ప్రణాళిక
- ఇప్పటికే సిటీలోని 9 సర్కిళ్లలో 656 రేషన్ షాపులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీలో మరో 100 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని 9 సర్కిళ్ల పరిధిలో 653 రేషన్ షాపులు ఉండగా, ఇందులో 65 షాపులు ఖాళీగా ఉన్నాయి. కొందరు షాపులను తిరిగి ఇచ్చేయడం, వివిధ కారణాల చేత షాపులను రద్దు చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే రోజురోజుకూ రేషన్‌కార్డుల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త రేషన్‌షాపుల ఏర్పాటు తప్పనిసరి అయ్యిందని అంటున్నారు.
అన్ని షాపులకు ఒకే విధంగా కార్డులు
అయితే ఏ సర్కిళ్ల పరిధిలో ఎన్ని రేషన్‌షాపులు పెంచాలన్న విషయంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో షాపు నిర్వాహకులకు 600 నుంచి 800 కార్డులు ఉండగా, కొన్ని సర్కిళ్ల పరిధిలో మాత్రం 1,200 కార్డుల వరకు ఉన్నాయి. ఈ హెచ్చుతగ్గులను తొలగించి అన్ని షాపులకు ఒకే విధంగా కార్డులను కేటాయించే విషయాన్ని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు.
అందుకే కార్డుల సంఖ్యను పెంచితేనే ఇది సాధ్యమవుతుందని అంటున్నారు. కొత్త షాపులను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ముఖ్యంగా నిరుద్యోగులకు, మహిళలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇప్పటికే 8.02 లక్షల కార్డులు..
హైదరాబాద్కోర్సిటీలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. గత ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన కొత్త కార్డుల జారీ ప్రక్రియలో ఇప్పటివరకు 1,62,575 కార్డులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. కొత్త కార్డులు మంజూరు చేయక ముందు నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 6,39,451 రేషన్‌కార్డులు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 8,02,026కు చేరింది.
అంతే కాకుండా మరో రెండు నెలల్లో 70 వేల కార్డులు జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దీంతో వస్తున్న దరఖాస్తులను వెంట వెంటనే వెరిఫికేషన్చేయిస్తున్నట్టు తెలిపారు. ఇక పెరుగుతున్న కార్డులతో పాటు బియ్యం పంపిణీ కోటా కూడా పెరుగుతున్నదన్నారు. గత రెండు నెలల క్రితం నెలకు 15 వేల మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేయగా, ప్రస్తుతం నెలకు 17,310 మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోందని అధికారులు తెలిపారు. కార్డుల సంఖ్య ఇంకా పెరిగితే బియ్యం పంపిణీ కూడా పెరగనుంది.