
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. పిడియా అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మావోయిస్ట్ అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కగార్’తో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో కొన్ని రోజులుగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు సహా మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. 2003లో చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడితో పాటు అనేక ఘటనల్లో కేశవరావు వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన వయసు 70 ఏండ్లు. కోటిన్నర రూపాయల రివార్డు కూడా ఉంది. ఎన్కౌంటర్జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : నకిరేకల్లో దారుణం.. గర్భిణి ప్రాణం తీసిన లింగనిర్ధారణ పరీక్షలు
బీజాపూర్, దంతెవాడ జిల్లాల నుంచి డీఆర్జీ బలగాలను నారాయణ్పూర్జిల్లా డీఆర్జీ బలగాలకు తోడుగా కూంబింగ్కోసం పంపించారు. మూడు రోజులుగా బలగాలు ఇంద్రావతి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇదే సమయంలో నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాట్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని గుర్తించిన భద్రతా బలగాలు ఒక్కసారిగా మెరుపుదాడికి దిగాయి. బుధవారం ఉదయం భారీగా కాల్పుల మోతలు వినిపించాయి. ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు.