పూరణ్ భట్​పై టెర్రరిస్టుల కాల్పులు

పూరణ్ భట్​పై టెర్రరిస్టుల కాల్పులు
  • మరో పండిట్ హత్య
  • దోషులను కఠినంగా శిక్షిస్తామన్న ఎల్జీ మనోజ్ సిన్హా 
  • అటాక్​ను ఖండించిన వివిధ పార్టీల నేతలు 

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్టులు మళ్లీ టార్గెట్ కిల్లింగ్ కు పాల్పడ్డారు. షోపియాన్ జిల్లా, చౌదరీ గుండ్ లో మరో కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు. చౌదరీ గుండ్​కు చెందిన పూరణ్ క్రిషన్ భట్ అనే కాశ్మీరీ పండిట్ శనివారం తన ఇంటి నుంచి పండ్ల తోటకు వెళ్తుండగా టెర్రరిస్టులు అతనిపైకి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన భట్​ను షోపియాన్​లోని హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని డీఐజీ సుజిత్ కుమార్ వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని కాశ్మీర్ ఫ్రీడం ఫైటర్ (కేఎఫ్ఎఫ్) గ్రూపు ప్రకటించినట్లు తెలిపారు. దాడి జరిగిన ఏరియాలో టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. భట్​పైకి ఓ మిలిటెంట్ కాల్పులు జరిపినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. “ఈ ఏరియాలో సెక్యూరిటీని పెట్టాం. ఓ గార్డు డ్యూటీలో ఉన్నాడు. భట్ స్కూటర్​పై బయటకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి పండ్ల తోటకు బయలుదేరగా ఇంటి సమీపంలోనే అతనిపై కాల్పులు జరిపారు. ఇక్కడ భద్రతా వైఫల్యానికి కారణాలను తెలుసుకుంటున్నాం. సెక్యూరిటీ సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం” అని డీఐజీ తెలిపారు. అంత్యక్రియల కోసం భట్ మృతదేహాన్ని జమ్మూకు తరలించనున్నట్లు షోపియాన్ డిప్యూటీ కమిషనర్ సచిన్ కుమార్ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. కాగా, కాశ్మీర్​లో నిరుడు అక్టోబర్​లో కాశ్మీరీ పండిట్లు, వలస కార్మికులు, హిందువుల వరుస హత్యలు సంచలనం సృష్టించాయి. తిరంగా ర్యాలీ నిర్వహించారని 2 నెలల క్రితం ఇద్దరు కాశ్మీరీ పండిట్ సోదరులపై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో సునీల్ కుమార్  చనిపోయారు. 

టెర్రర్ దాడి కుట్ర భగ్నం

జమ్మూకాశ్మీర్​లోని బాండిపొర జిల్లాలో భారీ అటాక్​కు టెర్రరిస్టులు చేసిన కుట్రను పోలీసులు, ఆర్మీ జవాన్లు భగ్నం చేశారు. నిత్యం ప్రజల వాహనాలు, ఆర్మీ, పోలీస్ వెహికల్స్ రాకపోకలతో రద్దీగా ఉండే బాండిపొర- సోపోర్ హైవే దగ్గర 18 కిలోల ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్) బాంబును గుర్తించి నిర్వీర్యం చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు శనివారం తెల్లవారుజాము నుంచే హైవే వద్ద 300 మీటర్ల పరిధిలో సోదాలు చేపట్టారు. ఉదయం 8.35కు హైవే సమీపంలో రెండు గ్యాస్ సిలిండర్​లకు ఫిట్ చేసి ఉన్న ఐఈడీని గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్ టీం ఆ బాంబును డిఫ్యూజ్ చేసింది. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో భారీ ముప్పు తప్పిందని అధికారులు చెప్పారు.   

ఐదుగురు ఉద్యోగులు డిస్మిస్..

జమ్మూకాశ్మీర్ లో యాంటీ నేషనల్ కార్యకలాపాల్లో పాల్గొన్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించారు. టెర్రర్ యాక్టివిటీస్ లో పాల్గొన్నందుకు వీరిపై కేసులు కూడా నమోదు చేసినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో వీరు ఇన్వాల్వ్ అయినట్లు పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించడంతో విచారణ కమిటీని వేశారు. వీరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు పాల్పడినట్లు కమిటీ కూడా తేల్చడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సర్వీస్ నుంచి తొలగించిన వారిలో.. బారాముల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ అఫాక్ అహ్మద్ వనీ, ఆగ్జిలరీ వింగ్ కానిస్టేబుల్ తన్వీర్ సలీం దార్, విలేజ్ లెవల్ వర్కర్ సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీ, చౌకీదార్ ఇష్రద్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ లైన్ మాన్ అబ్దుల్ మోమిన్ పీర్ ఉన్నట్లు పేర్కొన్నారు. రెండేండ్ల కిందటి నార్కో టెర్రరిజం రాకెట్ లో ఎన్ఐఏ కూడా వీరిపై చార్జిషీట్ నమోదు చేసిందన్నారు. వీరిలో అంద్రాబీ.. లష్కరే, హిజ్బుల్ టెర్రరిస్ట్ సంస్థలకు గ్రౌండ్ వర్కర్​గా కూడా పని చేసినట్లు తేలిందన్నారు.   

ఖండించిన నేతలు 

కాశ్మీరీ పండిట్ భట్ హత్యను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ‘‘కాశ్మీరీ పండిట్ పూరణ్ భట్​పై టెర్రరిస్టుల కాల్పులు క్రూరమైన, పిరికిపందల చర్య. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లకు కఠిన శిక్ష పడేలా చూస్తా. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నా” అని ఎల్జీ ట్వీట్ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ వైఎస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా, సీపీఎం నేత ఎంఐ తరిగామి, బీజేపీ జనరల్ సెక్రటరీ అశోక్ కౌల్, అప్నీ పార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ మహ్మద్ అల్తాఫ్ బుఖారితో పాటు పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీల నేతలు కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్​లో మైనారిటీలకు ప్రభుత్వం గట్టి భద్రత కల్పించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.