లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్ : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాజేష్ అనే వ్యక్తి.. ఇంట్లోని బోర్డుపై పేర్కొన్నాడు. తనను తీవ్రమైన పరుష పదజాలంతో వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించాడు. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేడుకున్నాడు. 

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో సీహెచ్ రాజేష్(35) లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు. ఈ మధ్య లోన్ యాప్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు తిడుతుండడంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేష్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య విజయవాడకు వెళ్లింది. మృతుడు రాజేశ్ కు భార్య, మూడేళ్ల కూతురు ఉంది. రాజేష్ ఆత్మహత్య ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని..అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు.