కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా లారీని ఢీ కొట్టిన బస్సు

కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా లారీని ఢీ కొట్టిన బస్సు

కర్నూలు: 19 మంది ప్రాణాలు మింగేసిన బస్సు ప్రమాద ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది. అయితే.. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురవడం ఆందోళనకు గురిచేసింది. 

ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. భారీ వర్షం కారణంగా ముందున్న వాహనాన్ని తప్పించబోయి  ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది. కర్నూలు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ దుర్ఘటనలో బస్సు ముందు అద్దాలతో పాటు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.

డ్రైవర్ ప్రమాద సమయంలో చాక చక్యంగా వ్యవహరించడంతోనే ప్రమాద తీవ్రత తగ్గిందని ప్రయాణికులు చెప్పారు. వర్షం కారణంగా బస్సు ముందున్న బొలెరో వాహనాన్ని తప్పించబోయి లారీని ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఆ బస్సులో ప్రయాణికుడు చెప్పాడు. 

బస్సు ప్రమాదం జరిగిన అనంతరం నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ వరకు బస్సును తీసుకురావడంతో RTA అధికారులు కేసు నమోదు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆరంగర్ చౌరస్తా దగ్గర దింపి బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.