జూరాల పక్కన మరో రిజర్వాయర్

జూరాల పక్కన మరో రిజర్వాయర్

హైదరాబాద్, వెలుగు: వరద రోజుల్లో కృష్ణా నది నీళ్లను ఒడిసి పట్టేందుకు మరో రిజర్వాయర్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జూరాల రిజర్వాయర్ను ఆనుకునే 20 టీఎంసీల కెపాసిటీతో ఇంకో జలాశయం నిర్మించాలంటూ ప్రతిపాదిస్తోంది. ఈ జలాశయం నిర్మాణం కోసం ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లు సర్వే పూర్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని నాగర్దొడ్డి వద్ద ఈ రిజర్వాయర్ ను ప్రతిపాదిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి కిలోమీటర్ దూరంలోనే ఈ కొత్త రిజర్వాయర్ ను నిర్మించనున్నారు. దీనిపై సర్వే పూర్తి చేసిన జూరాల సీఈ ఆ వివరాలతో ఈఎన్సీకి లేఖ రాశారు.

ఎక్కువ నీళ్లు మళ్లించుకునేలా..
కృష్ణాలో ఫ్లడ్ డేస్ 30కి పడిపోయిన నేపథ్యంలో జూరాల పాయింట్ నుంచి వీలైనన్ని ఎక్కువ నీళ్లను మళ్లించాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. పాలమూరు- రంగారెడ్డి సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చిన తర్వాత జూరాల పాయింట్ లో వచ్చే వరదను ఒడిసి పట్టేందుకు ప్రాజెక్టులు చేపట్టాలంటూ పాలమూరు ఉద్యమ వేదిక ఎప్పటి నుంచో కోరుతోంది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ఫోర్ షోర్ లో సంగమేశ్వరం లిఫ్టుతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని డబుల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీ ఇప్పటికే కృష్ణా నీటిని ఎక్కువగా తీసుకుంటూ పెన్నా బేసిన్ కు తరలిస్తోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టడం లేదని ప్రతిపక్షాలు, ఉద్యమ వేదికల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం జూరాల దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.

జూరాల ప్రాజెక్టును ఆనుకునే కాస్త ఎగువ భాగంలో నిర్మించే ఈ రిజర్వాయర్లోకి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 20 రోజుల్లో 20 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. దీని కింద ఏర్పాటు చేసే హైడల్ వపర్ ప్రాజెక్టు ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తూ జూరాలలో నీటిమట్టం పడిపోయిన తర్వాత కిందికి నీటిని విడుదల చేస్తారు. తద్వారా జూరాల నుంచి కనీసం 80 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుందని ఇంజనీర్లు భావిస్తున్నారు. నాగర్దొడ్డి జూరాల ముంపు గ్రామమేనని, ఇప్పటికే ఆ గ్రామస్తులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఉన్నామని, ఇప్పుడు వారిని ఖాళీ చేయించి రిజర్వాయర్ నిర్మించాలని ఇంజనీర్లు సూచిస్తున్నారు. తద్వారా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్య అంతగా ఉండదని చెప్తున్నారు.

రివర్సబుల్ టర్బైన్లతో రెండు విధాల లాభం
నాగర్దొడ్డి రిజర్వాయర్లో హైడల్ పవర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తుండటంతో రివర్సబుల్ టర్బైన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారానే నీటిని ఎత్తిపోస్తే రెండు విధాలా లాభం ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారు. ఒక పంపుహౌస్ ఏర్పాటు చేసి ఫ్లడ్ డేస్ లో నేరుగా నీళ్లు ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఓకే చెప్తే ఆ మేరకు పనులు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఈ ప్రతిపాదనలను స్టడీ చేయాలని ప్రాజెక్టు సీఈ ఇరిగేషన్ ఈఎన్సీని కోరారు. జూరాలలో నీటి మట్టం పడిపోయిన వెంటనే ఎగువ జలాశయంలోని పవర్ హౌస్ ద్వారా కరెంట్ఉత్పత్తి చేస్తూ కిందికి నీటిని విడుదల చేస్తారు. తద్వారా జూరాల ఆయకట్టుకు భరోసా దక్కడంతో పాటు జల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు.

రూ.5,200 కోట్లతో రిజర్వాయర్
నాగర్దొడ్డి నిర్మాణానికి రూ.5,200 కోట్లు అవసరమని ఇంజనీర్లు లెక్కగట్టారు. దీని నుంచి గట్టు ఎత్తిపోతల పథకానికి ఒక దశలో నీటిని ఎత్తిపోయడం ద్వారా దాని కింద ఇస్తామన్న 33 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావొచ్చని సూచిస్తున్నారు. గట్టు లిఫ్ట్ స్కీం వద్దనుకున్నా కొత్త రిజర్వాయర్ నుంచే నేరుగా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వొచ్చని, అప్పుడు వ్యయం ఇంకో రూ.500 కోట్లు తగ్గుతుందని అంచనా వేశారు. జూరాల కెపాసిటీ 9 టీఎంసీలు. డెడ్ స్టోరేజీ పోను అందులోంచి వాడుకునే నీళ్లు 6 టీఎంసీలే. దీనిపై ఆధారపడి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ లిఫ్ట్ స్కీంలు ఏర్పాటు చేశారు. కొత్త రిజర్వాయర్తో జూరాలతోపాటు లిఫ్ట్ స్కీంల ఆయకట్టుకు రెండో పంటకు నీళ్లు ఇవ్వొచ్చని ఇంజనీర్లు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి