
- ఇప్పటికే రూ. 2,500 కోట్ల ఆమ్దానీ
- మరింత రాబట్టేందుకు 25% ధరలు పెంచిన సర్కారు
- బ్రాండ్ ను బట్టి ఫుల్ బాటిల్‌పై
- రూ. 80 నుంచి 380 దాకా బాదుడు
- రాష్ట్ర ఏర్పాటు తర్వాత
- నాలుగోసారి ధరల పెంపు
- ఈ ఆర్థిక సంవత్సరంలో
- రూ. 38 వేల కోట్ల ఆదాయం టార్గెట్
- తాగుడు కంట్రోల్ చేసేందుకే రేట్లు పెంచినమంటున్న ఆబ్కారీ శాఖ
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆమ్దానీ సమకూరుతున్నది. ఇప్పటికే నెలకు రూ. 2,500 కోట్ల ఆదాయం వస్తుండగా.. గురువారం నుంచి మద్యం రేట్లను ప్రభుత్వం 20 నుంచి 25 శాతం పెంచేసింది. ఈ పెంపుతో అదనంగా నెలకు రూ. 500 కోట్ల రాబడి ప్రభుత్వానికి రానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.38 వేల కోట్ల ఆమ్దానీని లిక్కర్ ద్వారా రాబట్టుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు లిక్కర్ రేట్లు నాలుగుసార్లు పెరిగాయి. 2014తో పోలిస్తే మొత్తంగా 85 శాతం వరకు మద్యం ధరలు పెరుగగా.. సర్కారుకు మూడింతల ఆదాయం పెరిగింది. ఎక్సైజ్ శాఖ మాత్రం.. తాగుడు కంట్రోల్ చేసేందుకే రేట్లను పెంచినట్లు చెప్తున్నది. అయితే.. అప్పులు పుట్టకపోవడంతో ప్రభుత్వం లిక్కర్ రేట్లు పెంచి ఆదాయాన్ని సర్దుబాటు చేసుకుంటున్నదనే విమర్శలు వస్తున్నాయి.
25% వరకు లిక్కర్ రెట్లు పెంపు
రాష్ట్రంలో లిక్కర్ రేట్లను 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై రూ.10, లిక్కర్లో బ్రాండ్లు, ఎంఎల్‌ను బట్టి రేట్లు పెంచింది. రెండు వందల రూపాయల లోపు ఎమ్మార్పీ ఉన్న బ్రాండ్లపై క్వార్టర్ (180 ఎంఎల్)కు రూ.20, హాఫ్ (375 ఎంఎల్)కు రూ.40 లెక్కన రేట్లు పెరిగాయి. రూ.200 కంటే ఎక్కువ ఎమ్మార్పీ ఉన్న లిక్కర్ బ్రాండ్లపై క్వార్టర్‌కు రూ.40, హాఫ్‌కు రూ.80, ఫుల్ బాటిల్‌కు రూ.160 చొప్పున పెంచారు.
వైన్ బ్రాండ్‌లో ఎమ్మార్పీపై క్వార్టర్‌కు రూ.10, హాఫ్‌కు రూ.20, ఫుల్ బాటిల్‌కు రూ.40 చొప్పున రేట్లు పెంచారు. పెరిగిన రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. పాత ఎమ్మార్పీ ఉన్నప్పటికీ కొత్త ధరలు వర్తిస్తాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ధరల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏవైనా సమస్యలు ఉంటే 1800 425 2523 నంబర్‌కు సంప్రదించాలని సూచించింది. లిక్కర్ రేట్లను పెంచడంతో మొత్తంగా ప్రతి నెలా రూ.3 వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇప్పటి వరకు నెలకు యావరేజ్ గా రూ. 2,500 కోట్ల వరకు ఖజానాకు ఎక్సైజ్ శాఖ నుంచి రాబడి సమకూరుతున్నది. తాజాగా పెంచిన రేట్లతో మరో రూ. 500 కోట్లు అదనంగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
తాగుడు కంట్రోల్ చేసేందుకేనట!
రాష్ట్రంలో మందు తాగుడును కంట్రోల్ చేసేందుకే రేట్లు పెంచినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. రేట్లు పెంచినప్పటికీ ఏటా లిక్కర్ సేల్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. వేసవి కాలంలో బీర్లు, పండుగలు, డిసెంబర్ 31, పెండ్లిళ్ల సీజన్లో సాధారణ రోజుల కంటే డబుల్, ట్రిబుల్ స్థాయిలో సేల్స్ ఉంటున్నాయి. టార్గెట్లు పెట్టి మరీ సేల్స్ పెంచాల్సి వస్తున్నదని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
తెలంగాణ వచ్చాక 85% దాకా రేట్ల పెంపు
ఆబ్కారీ శాఖ నుంచి ఎంత ఆదాయం వచ్చినా ఇంకా రాబట్టుకోవాలన్న ఉద్దేశంతో టైం దొరికినప్పుడల్లా సర్కారు మద్యం ధరలను పెంచుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు రేట్లు పెంచింది. 2016లో 10 నుంచి 15 శాతం వరకు పెంచింది. 2019 డిసెంబర్‌లో 20 శాతం పెంచేసింది. 2021 కరోనా సమయంలో పాండెమిక్ సెస్ పేరుతో 25% దాకా పెంచింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా సెస్ తగ్గించినా.. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కంటిన్యూ చేస్తున్నది. ఇప్పుడు మరో 25% దాకా రేట్లు పెంచింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 85% వరకు మద్యం రేట్లు పెరిగాయి.
ఏడేండ్లలో లిక్కర్ ఆమ్దానీ మూడింతలు
రాష్ట్రంలో 2,620 వైన్స్‌తోపాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన కొత్తలో మద్యం అమ్మకాలు, ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేవి. లిక్కర్ ద్వారా 2014–15లో రూ. 10,880 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 2018–19లో ఏకంగా రూ. 20 వేల కోట్లు దాటింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ ఆమ్దానీ రూ. 28 వేల కోట్లు క్రాస్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ. 38 వేల కోట్లు రాబట్టుకోవాలని సర్కారు టార్గెట్ పెట్టుకుంది. ఆదాయం పెంచుకోవడం కోసం వైన్స్, బార్లను అర్ధరాత్రి వరకు తెరుచుకునేందుకు సర్కారు అనుమతిస్తున్నది. గతంలో 1,052 బార్లు ఉండగా.. కొత్తగా మరో 159 బార్లకు పర్మిషన్ ఇచ్చింది. ఇక ఎవరైనా పెద్ద లీడర్లతో చెప్పిస్తే ఎలైట్ బార్లకు వెంటనే పర్మిషన్ వస్తున్నది. ఇటీవల 409 కొత్త వైన్స్ కు
అనుమతి ఇచ్చారు.
తాజాగా పెరిగిన లిక్కర్ రేట్లు ఇట్లా.. (రూపాయల్లో)
బ్రాండ్ పేరు పాత ధర కొత్త ధర
(ఫుల్ బాటిల్)
ఓసీ 530 640
రాయల్ చాలెంజ్ 980 1,200
రాయల్ స్టాగ్ 800 880
టీచర్స్ 1,950 2,320
సిగ్నేచర్ 1,180 1,360
బ్లెండర్స్ ప్రైడ్ 1,200 1,360
ఐబీ 660 760