ఉద్యోగులకు త్వరలో మరో షాక్?

ఉద్యోగులకు త్వరలో మరో షాక్?

ఉద్యోగుల హెచ్​ఆర్​ఏలో కోత?

నాలుగు స్లాబ్​ల విధానానికి సెలవు!

20%, 10% స్లాబ్​లుగా కుదింపు.. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఫిట్​మెంట్ ఎంతో తేలాకే తుది నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ కమిటీ గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు మరో షాకివ్వబోతున్నది. హౌస్​ రెంట్​ అలవెన్స్​ (హెచ్ఆర్ఏ)లో కోత పెట్టే దిశగా కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం నాలుగు స్లాబ్​లుగా ఉన్న హెచ్​ఆర్​ఏను  రెండు స్లాబ్​లుగా చేసే ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ కొత్త విధానాన్ని  పీఆర్సీ ప్రకటించే సమయంలోనే అనౌన్స్ చేసే చాన్స్​ ఉందని ఓ సీనియర్ ఆఫీసర్​ తెలిపారు. ఉద్యోగి బేసిక్  శాలరీకి అదనంగా ప్రభుత్వం హెచ్ ఆర్ ఏ ఇస్తుంటుంది. ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తీరుగా లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 20 శాతం, 50 వేల జనాభా దాటిన పట్టణాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12.5 శాతంగా నాలుగు స్లాబ్​ల్లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దె అవసరం లేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్​ఆర్​ ఏను కుదించింది.

గ్రేడ్ వన్ నగరాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏను  30 శాతం నుంచి 24 కు తగ్గించింది. అదే మోడల్​లో రాష్ట్రంలో హెచ్​ఆర్​ఏను సవరించేందుకు రివ్యూ చేయాలని సీఎం కేసీఆర్​ సూచించినట్లు ఓ సీనియర్ ఆఫీసర్​  తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల ఉద్యోగుల జీతాల కంటే రాష్ట్రంలో ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్నారని, హెచ్ ఆర్ ఏ ను తగ్గించడం తప్పేమీ కాదనే అభిప్రాయం ఆర్థిక శాఖ వర్గాల్లో ఉంది. హెచ్ఆర్​ ఏ సవరిస్తే ఎంత మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది? ఎంతమందికి తగ్గుతుంది? ఏయే స్లాబ్​లుంటే సవరణ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది? అనే ప్రతిపాదనలపై ఇప్పటికే ఆర్థిక శాఖ నివేదికను రూపొందించింది. త్వరలో సీఎంతో జరిగే  సమీక్ష సమావేశంలో ఇది చర్చకు వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతే నిర్ణయం వెలువడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రెండు స్లాబ్​లు?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న హెచ్​ఆర్​ఏలో నాలుగు స్లాబ్​ల విధానాన్ని రద్దు చేసి.. వాటి స్థానంలో రెండు స్లాబ్​ల విధానాన్ని అమలు చేసే చాన్స్  ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 శాతం,  మిగతా ప్రాంతాలకు 10 శాతం హెచ్​ఆర్​ ఏ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ సవరణతో  గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తోన్న ఉద్యోగులకు, నగర ప్రాంతాల్లో పనిచేసే ఎంప్లాయీస్  హెచ్ ఆర్ ఏకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గిపోతుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. గత పీఆర్సీ అమలు చేసినప్పుడే గ్రేటర్ హైదరాబాద్ కు చుట్టూరా ఉన్న 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో 30 శాతం హెచ్ ఆర్ ఏ ను ఇవ్వడం సరికాదనే  అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే హెచ్​ఆర్​ఏ స్లాబ్​లను సవరించాలని ఇప్పటికే పలుమార్లు సమీక్షలో సీఎం అభిప్రాయపడ్డట్లు అధికారులు చెబుతున్నారు.

పీఆర్సీ టైమ్​లోనే ప్రకటన

పీఆర్సీ ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కమిషన్​ గడువు పొడిగించటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో పీఆర్సీ ఫిట్​మెంట్ ఎంత ఇవ్వాలనే విషయంలోనూ ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కలేసుకుంది. ఒక్క శాతం ఫిట్​మెంట్ కు రూ.350 కోట్ల ఖర్చు అవుతుందని,10 శాతం పిట్​మెంట్​ ఇస్తే ఏడాదికి రూ. 4,200 కోట్ల అదనపు భారం ఖజానాపై పడుతుందని ఆర్థిక శాఖలోని ఓ సీనియర్ ఆఫీసర్​ చెప్పారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్​చెల్లిస్తోంది. అంతకంటే ఎక్కువగానే తెలంగాణలోనూ పీఆర్సీ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ఉద్యోగ సంఘాలు ధీమాతో ఉన్నాయి. కానీ..  ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఫిట్​మెంట్​ పెంచినా.. హెచ్​ఆర్​ఏ కోత వేస్తే ఖజానాపై ఎంత భారం తగ్గుతుందనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. అందుకే ఫిట్​మెంట్ ను బట్టే హెచ్​ఆర్​ఏపై నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి.

For More News..

జవానుకు పెండ్లి కానుకగా కొత్త ఇల్లు

లీప్ డే రోజు 1650 మంది పుట్టిండ్రు

రామయ్య కల్యాణానికి కాసుల కష్టం