సైన్యం చేతికి నాగాస్త్రం

సైన్యం చేతికి నాగాస్త్రం
  •     ఫస్ట్ బ్యాచ్ కింద 120 డ్రోన్లు అందజేసిన ఈఈఎల్ కంపెనీ
  •     స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన సూసైడ్​ డ్రోన్

న్యూఢిల్లీ :  భారత సైన్యం చేతికి మరో అత్యాధునిక ఆయుధం అందుబాటులోకి వచ్చింది. మానవరహిత డ్రోన్ల వ్యవస్థ(యూఏవీ) ఆధారంగా, గగనతలం నుంచి దాడి చేసేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన నాగాస్త్ర–1 సైనిక అమ్ముల పొదిలో చేరింది. మేకిన్ ఇండియాలో భాగంగా సైన్యం ఈ డ్రోన్​ఆయుధాన్ని దేశీయంగా తయారుచేయించింది. ఇందులో ఉపయోగించిన పరికరాల్లో దాదాపు 70 శాతం మన దేశంలోనే తయారైనవని పేర్కొంది. 

అత్యవసర అవసరాల కోసం తనకున్న కొనుగోలు అధికారం ఉపయోగించి ఆర్మీ ఈ ఆర్డర్ పెట్టింది. ఎకనామిక్స్ ఎక్స్​ప్లోజివ్స్ లిమిటెడ్(ఈఈఎల్) సోలార్ కంపెనీకి మొత్తంగా 480 డ్రోన్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో తొలి బ్యాచ్ కింద 120 డ్రోన్లను సిద్ధం చేసిన కంపెనీ.. వాటిని శుక్రవారం ఆర్మీకి అప్పగించింది. వాటిని టెస్ట్ చేసి చూశాక ఈ యూనిట్లను ఆర్మీ స్వీకరించింది.

విశేషాలు..

  •     యూఏవీ ఆధారిత వ్యవస్థతో రూపొందిన డ్రోన్లు.. గగనతలం నుంచి దాడిచేసే సామర్థ్యం
  •     డ్రోన్​ను ప్రయోగించిన తర్వాత కూడా దాడిని ఆపి సేఫ్​గా వెనక్కి రప్పించే అవకాశం
  •     జీపీఎస్ ఆధారంగా లక్ష్యం ఛేదించేలా డిజైన్​
  •     అవసరమైతే బాంబుతో పాటు తనను తాను పేల్చుకునేలా రూపకల్పన (సూసైడ్​ అటాక్) 
  •     ఆకాశంలోనే వేచి ఉండే సామర్థ్యం
  •     రిమోట్​ తో 15 కి.మీ. దూరం వరకు, ఆటో మోడ్​ లో 30 కి.మీ. వరకు నియంత్రించవచ్చు
  •     పగలు, రాత్రి కూడా చక్కగా రికార్డు చేసే కెమెరాలతో నిఘా పెట్టే వీలు
  •     10 కిలోల వరకు బరువున్న పేలుడు పదార్థాలు కానీ, ఆయుధాలను కానీ మోసుకెళ్లగలదు.