చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడి.. మహిళ మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడి.. మహిళ మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లాలోని కుప్పం మండలంలో నాలుగు రోజుల క్రితం పొలంలో ఓ యువతి మృతిచెందగా.. తాజాగా మరో మహిళ ఏనుగు దాడిలో మృతిచెందింది. శనివారం రాత్రి గుడుపల్లి, శాంతిపురం మండలాల్లో ఒక ఏనుగు దాడికి పాల్పడింది. ఈ దాడిలో చింతరపల్యంలో నారాయణప్ప అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ నారాయణను ఆసుపత్రికి తరలించారు. అలాగే శాంతిపురం మండలం రాళ్లపల్లిలో పొలం పనులు చేస్తున్న పాపమ్మపై ఏనుగు దాడి చేయగా, ఆమె మృతిచెందింది.

కాగా, రెండు రోజుల క్రితం కుప్పం మండలం పత్తి చేనులో ఏనుగుల దాడికి పాల్పడ్డాయి. ఆ ఘటనలో ఒక యువతి మృతిచెందగా పలువురికి గాయాలు అయ్యాయి. వరుస ఘటనల మీద అటవీ అధికారులు రైతులకు ప్రజలు పలు సూచనలు చేస్తున్నారు. ఏనుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరుస ఏనుగుల దాడులతో చేతికందిన పంటలు నష్టపోవడంతో రైతులు, గ్రామాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను బంధించాలని అటవీ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.