అడవి పందుల కళేబరాల్లో ఆంత్రాక్స్ గుర్తింపు

అడవి పందుల కళేబరాల్లో ఆంత్రాక్స్ గుర్తింపు
  • అడవి పందుల కళేబరాల్లో గుర్తించిన అధికారులు

తిరువనంతపురం: కేరళలో ఆంత్రాక్స్‌‌ కలకలం రేగుతోంది. అథిరాపిళ్లై ఫారెస్ట్ లో అనుమానాస్పదంగా కొన్ని అడవి పందులు చనిపోయాయి. దీంతో అధికారులు చనిపోయిన అడవి పందుల కళేబరాల నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షించగా, ఇవి ఆంత్రాక్స్‌‌ వల్లే చనిపోయినట్లు గుర్తించారు. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఈ బ్యాక్టీరియా వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర హెల్త్‌‌ మినిస్టర్‌‌‌‌ వీనా జార్జ్‌‌ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, బాసిల్లస్‌‌ ఆంత్రాసిస్‌‌ బ్యాక్టీరియా వల్ల ఆంత్రాక్స్‌‌ వ్యాపిస్తుందని అమెరికాకు చెందిన సెంటర్స్‌‌ ఫర్‌‌‌‌ డిసీజ్ కంట్రోల్‌‌ అండ్‌‌ ప్రివెన్షన్‌‌ (సీడీసీ) తెలిపింది. ఇది సాధారణంగా పెంపుడు, అడవి జంతువుల్లో వ్యాపిస్తుందని, వాటి నుంచి మనుషులకు సోకుతుందని సీడీసీ వెల్లడించింది. ఆంత్రాక్స్‌‌ సోకిన జంతువు మాంసం తిన్నా, ఆ జీవులను ముట్టుకున్నా.. ఆ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని పేర్కొంది. దీని వల్ల జ్వరం, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు తదితర లక్షణాలు ఉంటాయని చెప్పింది. ఒక్కోసారి ప్రాణాలకూ ముప్పు అని పేర్కొంది.