యాంటీబయాటిక్స్‘ఎమర్జెన్సీ’...! 83 శాతం మందిలో మందులకు లొంగని బ్యాక్టీరియా

యాంటీబయాటిక్స్‘ఎమర్జెన్సీ’...! 83 శాతం మందిలో మందులకు లొంగని బ్యాక్టీరియా
  • హైదరాబాద్​ ఏఐజీ ఆస్పత్రి డాక్టర్ల స్టడీలో వెల్లడి
  • ఇండియాతో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్​ దేశస్తులపైనా అధ్యయనం
  • ఆస్పత్రుల నుంచి ఇండ్లలోకి బ్యాక్టీరియా పాకిందని తేల్చిన స్టడీ
  • ఇది పబ్లిక్​ హెల్త్​ ఎమర్జెన్సీనే అంటున్న డాక్టర్లు
  • దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో ప్రభుత్వాలు పనిచేయాలి: డాక్టర్​ నాగేశ్వర్​ రెడ్డి
  • హెల్త్​ డిజాస్టర్​ రాకుండా యాంటీ బయాటిక్స్​ వాడకంపై కఠిన చట్టాలు తేవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: దేశంలో యాంటీబయాటిక్స్​ ఎమర్జెన్సీ వచ్చే రోజులు అతిదగ్గర్లోనే ఉన్నాయి. మెడికల్​ షాపుల్లో ప్రిస్క్రిప్షన్​ లేకుండా విచ్చలవిడిగా మందులు అమ్మేయడం.. కోళ్ల పెరుగుదల కోసం ఫారాల్లో వాడేయడం.. పాల ఉత్పత్తిలోనూ వాటి వాడకం పెరిగిపోతుండడంతో బ్యాక్టీరియాలు మందులకు లొంగకుండా తయారవుతున్నాయి. ఇదే ప్రమాదమనుకుంటే.. ఇప్పుడు మనుషుల్లోనూ మందులకు లొంగని ఆ మొండి బ్యాక్టీరియాలు చేరిపోతున్నాయి. 

అవును, హైదరాబాద్​లోని ప్రముఖ ఆస్పత్రి ఏషియన్​ఇన్​స్టిట్యూట్​ఆఫ్​గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చేసిన గ్లోబల్​ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. మన దేశంలోని 83 శాతం మంది రోగుల్లో మందులకు లొంగని బ్యాక్టీరియా (మల్టీడ్రగ్​ రెసిస్టెన్స్​ ఆర్గనిజమ్స్​)ను ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు గుర్తించారు. ఎండోస్కోపిక్​ రెట్రోగ్రేడ్​ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ (ఈఆర్​సీపీ– లివర్​, పాంక్రియాటిక్​ జబ్బులతో బాధపడే) రోగుల్లో ఈ మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. 

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా.. మన దేశంలోనే అలాంటి బ్యాక్టీరియాల బారిన పడినోళ్లు ఎక్కువున్నట్టు ఏఐజీ స్టడీ హెచ్చరించింది. ఏఐజీ స్టడీలో భాగంగా ఇండియాతో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్​కు చెందిన వారి శాంపిళ్లనూ పరీక్షించారు. ఇందులో మన దేశ రోగుల్లో 83 శాతం మందిలో మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ఆ తర్వాత ఇటలీకి చెందిన 31.5 శాతం మంది, అమెరికాకు చెందిన 20.1 శాతం మందిలో వాటి ప్రభావం ఉన్నట్టు తేల్చారు. అత్యల్పంగా నెదర్లాండ్స్​లో 10 శాతం మందిపైనే ఆ మొండి బ్యాక్టీరియా ప్రభావం ఉందని గుర్తించారు. 

హై పవర్​ మందులు వాడినా లొంగట్లేదు..

ఎన్ని యాంటీ బయాటిక్​లు వాడినా ప్రయోజనం లేదనుకున్న సందర్భంలో.. చివరి అస్త్రంగా హైపవర్​ లేటెస్ట్​ యాంటీ బయాటిక్స్ వాడినా కొన్ని బ్యాక్టీరియాలు లొంగడం లేదని స్టడీలో తేల్చారు. అలాంటి రకాలే ఎష్కరీషియా కొలై, క్లెబ్సియెల్లా న్యుమోనియా, కార్బాపీనమ్​ రెసిస్టెంట్​ బ్యాక్టీరియా అని  నిర్ధారించారు. 70 శాతం మందిలో ఈ ఎష్కరీషియా కొలై, క్లెబ్సియెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లుండగా.. మరో 28 శాతం మందిలో కార్బాపీనమ్​ రెసిస్టెంట్​ బ్యాక్టీరియా ఉందని గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి హైఎండ్​ యాంటీబయాటిక్స్​కు కూడా లొంగడం లేదని, వాటిని ట్రీట్​ చేయడం కష్టతరమవుతుందని, పేషెంట్​ కోలుకోవడానికీ ఎక్కువ సమయం పడుతుందని, కాంప్లికేషన్స్​ ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మన మధ్యలోనే..

ఇలాంటి మొండి బ్యాక్టీరియాలు ఇంతకుముందు వరకూ ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​జరిగే సందర్భాల్లోనే కనిపించేవని రీసెర్చర్లు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు మన ఇండ్ల మధ్యకే వచ్చేశాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం యాంటీ బయాటిక్స్​ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడమేనని హెచ్చరిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్​ లేకుండా మెడికల్​ షాపుల్లో అమ్మడం, కోర్సు పూర్తయ్యే వరకు వాడకుండా మధ్యలోనే ఆపేయడం, సొంతంగా వాడడం వంటివి యాంటీబయాటిక్స్​కు బ్యాక్టీరియాలు లొంగకుండా మొండిబారడానికి కారణాలవుతున్నాయంటున్నారు. ఇది ఒకరకంగా పబ్లిక్​ హెల్త్​ ఎమర్జెన్సీ అని తేల్చేస్తున్నారు.  

కాగా, బ్యాక్టీరియాలు మొండిగా తయారవడం.. ఇవ్వాల్సిన యాంటీ బయాటిక్స్​కు లొంగకపోతుండడంతో శక్తిమంతమైన, మరింత టాక్సిక్​ యాంటీ బయాటిక్స్​ను బలవంతంగా ఇవ్వాల్సి వస్తున్నదని ఏఐజీ హాస్పిటల్స్​ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్​ డాక్టర్​ హార్దిక్​ రుఘ్వాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆరు నియమాలు పాటించాల్సిందే..యాంటీ బయాటిక్స్​కు బ్యాక్టీరియా రెసిస్టెన్స్​ను తగ్గించాలంటే ఆరు నియమాలను కచ్చితంగా పాటించాల్సిందేనని డాక్టర్​ నాగేశ్వర్​ రెడ్డి సూచించారు.. 

  •     ప్రిస్క్రిప్షన్​ లేకుండా యాంటీ బయాటిక్స్​ వాడొద్దు. సొంత వైద్యం, మెడికల్​ షాపులు ఇచ్చే యాంటీ బయాటిక్స్ తీసుకోవద్దు. దీనిని పాటిస్తే యాంటి బయాటిక్స్​ రెసిస్టెన్స్​ను చాలా వరకు తగ్గించొచ్చు. 
  •     వైరల్​ జబ్బులకు యాంటీ బయాటిక్స్​ రాయమనొద్దు. చాలా వరకు జ్వరాలు, సర్ది, దగ్గు, డయేరియా (విరేచనాలు) వంటివి వైరస్​ ప్రభావంతో వస్తుంటాయి. వాటికి యాంటీ బయాటిక్స్​ ఇచ్చినా పనిచేయవు.  
  •     యాంటీ బయాటిక్స్​ వాడాల్సి వస్తే.. కోర్సును పూర్తి చేయాల్సిందే. ఆరోగ్యం మంచిగైందికదా అని మధ్యలోనే ఆ కోర్సును ఆపేస్తే.. బ్యాక్టీరియా మరింత శక్తిమంతంగా మారుతుంది. రెసిస్టెన్స్​ను సంతరించుకుంటుంది. 
  •     వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. శుభ్రమైన నీళ్లు తాగాలి. మంచి ఆహారం తీసుకోవాలి. బయటకు వెళ్లొచ్చిన తర్వాత స్నానమో లేదా సానిటైజేషనో చేసుకుంటే ఇన్​ఫెక్షన్ల బారిన పడడం తగ్గుతుంది. 
  •     అవసరమైన వ్యాక్సిన్లు వేసుకోవాలి. దీని వల్ల ఇన్​ఫెక్షన్లను ముందుగానే నివారించవచ్చు. తద్వారా యాంటీ బయాటిక్స్​ రెసిస్టెన్స్​ తగ్గిపోతాయి.. సూపర్​ బగ్స్​ కూడా తగ్గుతాయి. 
  •     పెంపుడు జంతువులు, పశువులకు యాంటీ బయాటిక్స్​ వేయించొద్దు. వెటర్నరీ డాక్టర్ల సలహా లేకుండా వాటిని వాడకూడదు. అడ్డగోలుగా జంతువులకూ యాంటీ బయాటిక్స్​ను వాడితే.. జంతువుల నుంచి మనుషులకూ ఈ రెసిస్టెంట్​ బ్యాక్టీరియా సోకుతుంది.

ఇప్పటికైనా మేల్కోవాలి..

యాంటీబయాటిక్స్​ రెసిస్టెన్స్​పై ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాల్సిన అవసరం ఉంది. కామన్​ చెకప్​లకు వస్తున్న వారిలోనూ హైఎండ్​ మందులకు లొంగని బ్యాక్టీరియా ఆనవాళ్లున్నాయి. ఇదిప్పుడు కేవలం ఆస్పత్రులకు పరిమితమైన సమస్య కాదు. మన రోజువారీ జీవితాల్లోకీ.. మన వాతావరణంలోకీ ఈ బ్యాక్టీరియాలు చేరిపోయాయి. 

ప్రస్తుతం చిన్న చిన్న ఇన్​ఫెక్షన్లకూ ట్రీట్​మెంట్​ అందించలేని రోజులు వచ్చే ప్రమాదం ముంచుకొస్తున్నది. దేశవ్యాప్తంగా యాంటీబయాటిక్స్​ వాడకంపై ఓ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించాలి. భవిష్యత్​లో హెల్త్​ డిజాస్టర్​ రాకుండా యాంటీ బయాటిక్స్​ వాడకంపై కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్​ డి. నాగేశ్వర్​ రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్​ చైర్మన్