ఎయిర్​పోర్టుల్లో యాంటీ డ్రోన్ టెక్నాలజీ?

ఎయిర్​పోర్టుల్లో యాంటీ డ్రోన్ టెక్నాలజీ?

సెప్టెంబర్ 14.. సౌదీ ఆరేబియాలోని ఆయిల్​ప్లాంట్లపై డ్రోన్​దాడులు జరిగిన రోజు. చిన్న డ్రోనులు ఉపయోగించి యెమన్ రెబల్స్ చేసిన అటాక్​వల్ల భారీగా నష్టం వాటిల్లింది. సౌదీలో జరిగిన దాడులు.. ఇండియాలో ఎన్నో ప్రశ్నలను, అనుమానాలను రేకెత్తించాయి. దేశంలోకి ఎప్పుడెప్పుడు చొరబడాలా అని ఎదురుచూస్తున్న ఉగ్రవాదులు.. బాంబులతో డ్రోన్​దాడులకు దిగితే ఏంటి పరిస్థితి? అటాక్​ను ముందుగానే గుర్తించి అడ్డుకోలేమా? అనే ప్రశ్నల నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ముందు జాగ్రత్తలకు దిగింది. దేశంలో సివిల్ ఎయిర్​పోర్టులను సురక్షితంగా ఉంచేందుకు, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్​టెక్నాలజీని సిద్ధం చేసే పనిలో పడింది. ఇందుకోసం బ్లూ ప్రింట్ తయారు చేస్తోంది. ఐఐటీ బాంబే ఓల్డ్ స్టూడెంట్స్​కు చెందిన ‘ఐడియా ఫోర్జ్’ అనే కంపెనీకి బ్లూప్రింట్​రూపొందించే టాస్క్ అప్పజెప్పింది. ఈ ఏడాది చివరికల్లా పరిష్కారంతో రావాలని సూచించింది.

దాడులకు జైషే, లష్కరే ప్లాన్లు

జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి టెర్రర్ సంస్థలు ఎల్ఈడీలు అమర్చిన డ్రోన్లతో ఎయిర్​పోర్టులు, ఇతర ప్రభుత్వ సంస్థలపై దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. గత మూడు నెలల్లో ఢిల్లీలోని రోహినీ ఏరియాలో కొందరు రెక్కీ నిర్వహించినట్లు కూడా సమాచారం అందింది. ఈ క్రమంలో వెస్ట్రన్, డొమెస్టిక్ యాంటీ డ్రోన్ మేకర్లను సీఐఎస్ఎఫ్ పరిశీలించింది. వాటి ఫీల్డ్ రిజల్ట్స్ విషయంలో సంతృప్తి చెందలేదు. సీఐఎస్ఎఫ్ పేర్కొన్న ప్రమాణాలు అవి అందుకోలేకపోవడమే ఇందుకు కారణం. తర్వాత డీఆర్​డీవోతో కలిసి ఐడియా ఫోర్జ్ కంపెనీ తయారు చేసిన ‘నేత్ర’ డ్రోన్​కు ఓకే చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం తయారీ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.