75 మంది మృతి ... 1,200 మంది అరెస్టు

75 మంది మృతి ... 1,200 మంది అరెస్టు
  • ఇరాన్​లో ఆగని ఆందోళనలు.. 
  • 75 మంది మృతిa
  • ఇప్పటి వరకు 1,200 మంది అరెస్టు

టెహ్రాన్: ఇరాన్ లో యాంటీ హిజాబ్ నిరసనలు కొనసాగుతున్నాయి. గత పది రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. మంగళవారం ఆందోళనకారులు రోడ్ల పైకి వచ్చి నినాదాలు చేశారు. ‘‘డెత్ టు ద డిక్టేటర్” అంటూ మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. దేశంలోని 46 సిటీలకు నిరసనలు పాకగా, ఆందోళనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 41 మంది చనిపోయారని లోకల్ మీడియా పేర్కొంది. అయితే ఇప్పటి వరకు 75 మంది చనిపోయారని.. 1,200 మందిని అరెస్టు చేశారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. కాగా, ప్రభుత్వానికి మద్దతుగా కొంతమంది ర్యాలీలు చేస్తున్నారు. అమెరికన్ కిరాయి సైనికులు మతంతో పోరాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. 
 
సోదరుడి అంత్యక్రియల్లో యువతి నిరసన.. 

ఆందోళనలు మొదలైనప్పటి నుంచి జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్​లు తగులబెడ్తూ మహిళలు నిరసన తెలుపుతున్నారు. యాంటీ హిజాబ్ ఆందోళనల్లో ఓ యువకుడు చనిపోగా, అంత్యక్రియల్లో అతని సోదరి జుట్టు కత్తిరించుకొని నిరసన తెలిపింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జావెద్ హైదరీ అనే యువకుడు యాంటీ హిజాబ్ ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడు. అంత్యక్రియల టైమ్ లో అతని సోదరి ఏడుస్తూ జుట్టు కత్తిరించుకొని డెడ్ బాడీపై వేసింది.