మందులు పార్తలేవ్​.. ఉన్న రోగం తగ్గకపోగా.. కొత్త రోగాలు పుడ్తున్నయ్​

మందులు పార్తలేవ్​.. ఉన్న రోగం తగ్గకపోగా.. కొత్త రోగాలు పుడ్తున్నయ్​
  • మందులు పార్తలేవ్​
  • ఉన్న రోగం తగ్గకపోగా.. కొత్త రోగాలు పుడ్తున్నయ్​
  • దెబ్బతింటున్న ఆర్గాన్స్.. ఐసీఎంఆర్​ స్టడీలో వెల్లడి
  • ప్రిస్క్రిప్షన్​ లేకుండానే యాంటి బయాటిక్స్​ సేల్స్​
  • కంట్రోల్​ చేయడంలో సర్కార్​ ఫెయిల్​
  • మూడేండ్ల కింద చెప్పిన యాంటి బయాటిక్స్​ పాలసీ ఇప్పటికీ తేలే

ముత్తెమంత సర్దయినా.. చిన్న నొప్పి వచ్చినా.. మెడికల్​ షాపుకు పోవుడు, ఏదో ఓ గోలి తెచ్చుకొని మింగుడు.. ఇప్పుడు ఇది చానా మందికి అలవాటైంది. ఆ అలవాటే రోగాలకు మరింత తాకత్​ తెచ్చిపెడుతున్నది. ఎన్ని గోలీలు మింగినా, ఎన్ని సూదులు తీసుకున్నా రోగాలు తగ్గుతలేవు. మందులు పార్తలేవ్​. పాణాలు గుంజుక పోతున్నయ్​. ఇష్టమొచ్చినట్లు యాంటిబయాటిక్స్​ వాడటంతో రోగాలు తిరగబడుతున్నయ్​​. పెయ్యిల ఉన్న బ్యాక్టీరియా, వైరస్ వాటికి అలవాటుపడి స్ట్రాంగ్​ అయితున్నయ్. దీంతో ఉన్న రోగం తగ్గకపోగా.. కొత్త కొత్త రోగాలు మోపైతున్నయ్​. 

హైదరాబాద్, వెలుగు: యాంటి బయాటిక్​ మందులు విచ్చలవిడిగా వాడటంతో అసలుకే ఎసరు వస్తోంది. మందులకు రోగాలు తగ్గకపోగా ఇంకింత ముదురుతున్నాయి. యాంటి బయాటిక్  రెసిస్టెన్స్‌‌ విపరీతంగా పెరుగుతోందని, దీనివల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్‌‌(ఐసీఎంఆర్‌‌‌‌) హెచ్చరించింది. ఐసీయూ రోగుల్లో వాడే కార్బపెనెమ్‌‌, కోలిస్టిన్ వంటి హైఎండ్ యాంటిబయాటిక్స్‌‌ కూడా రోగాలను తగ్గించలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంపీసిలిన్, పెన్సిలిన్, సెఫెలోస్పోరిన్ వంటి కామన్ యాంటిబయాటిక్స్‌‌.. చిన్న చిన్న ఇన్​ఫెషన్లను కూడా తగ్గించలేకపోతున్నాయని వెల్లడించింది. దీంతో చిన్న రోగాలకు కూడా ఎక్కువ డోసు యాంటి బయాటిక్స్‌‌ వాడాల్సిన అవసరం ఏర్పడి సైడ్‌‌ ఎఫెక్ట్స్ పెరుగుతాయని వెల్లడించింది. ఈ మేరకు 65,561  మంది పేషెంట్లపై ఐసీఎంఆర్​ స్టడీ చేసి పూర్తి రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌‌లోని నిమ్స్ సహా దేశవ్యాప్తంగా 30 హాస్పిటళ్లలో ఈ స్టడీ చేశారు. ఒక్కో హాస్పిటల్‌‌‌‌లో 2 వేల నుంచి 2,500 మంది పేషెంట్ల రిపోర్టుల ఆధారంగా రెసిస్టెన్స్‌‌‌‌ను అంచనా వేశారు. ఏయే బ్యాక్టీరియాలు, ఏయే యాంటి బయాటిక్స్‌‌‌‌కు లొంగడం లేదో వివరించారు. లంగ్, యూరినరీ ట్రాక్ట్, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే క్యాండిడ ఆరిస్, బౌమాని, సాల్మొనెల్ల టైఫీ వంటి బ్యాక్టీరియాలు హైఎండ్‌‌‌‌ యాంటిబయాటిక్స్‌‌‌‌కు కూడా లొంగుతలేవని రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నారు.

ఎందుకు ఇట్లయితున్నది..?
యాంటి బయాటిక్  రెసిస్టెన్స్ పెరగడానికి అనవసరంగా మెడిసిన్ వాడడమే ముఖ్య కారణం. జనాలు సర్దయినా నేరుగా మెడికల్ షాపుకు వెళ్తున్నారు. తమకు తెలిసిన మెడిసినో లేదా షాపు కీపర్లు ఇచ్చే యాంటిబయాటిక్స్‌‌‌‌, స్టెరాయిడ్సో  వాడి చూస్తున్నారు. ఇలా ఒకట్రెండు ట్రయల్స్‌‌‌‌ వేసి అప్పటికీ తగ్గకపోతేనే డాక్టర్లను సంప్రదిస్తున్నారు. సర్ది, దగ్గు వంటి చిన్న చిన్న విషయాలకు కూడా యాంటిబయాటిక్స్‌‌‌‌ వాడుతున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు, పీఎంపీలు తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు జబ్బు త్వరగా తగ్గాలన్న ఉద్దేశంతో మెరోపినం వంటి హైఎండ్ యాంటిబయాటిక్స్‌‌‌‌, స్టెరాయిడ్స్‌‌‌‌ కూడా ఇస్తున్నారు. ఇలా తరచూ వాడడం వల్ల ఆయా డ్రగ్స్‌‌‌‌ను ఎదుర్కొనేలా బ్యాక్టీరియాలు, వైరస్‌‌‌‌లు స్ర్టాంగ్‌‌‌‌ అవుతాయి. అవసరమైనప్పుడు ఇక అవి వాడినా పనిచేయవు. మన దగ్గర కరోనాతో యాంటిబయాటిక్స్ వినియోగం విపరీతంగా పెరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రిస్ర్కిప్షన్ లేకుండా యాంటిబయాటిక్స్‌‌‌‌ అమ్మొద్దు. కానీ, తమ సేల్స్ కోసం రూల్స్‌‌‌‌ను పక్కనబెట్టి షెడ్యూల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ కూడా ఇష్టమొచ్చినట్టు అమ్ముతున్నారు.

పాలసీ ఏమాయె?
యాంటి బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ తగ్గించేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఓ పాలసీ తీసుకొచ్చింది. రాష్ట్రంలో యాంటి బయాటిక్స్ పాలసీ తెస్తున్నామని, ఇందుకోసం ఓ కమిటీ వేయబోతున్నామని మూడేండ్ల కిందట్నే సర్కారు ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు కమిటీ వేయలేదు. రాష్ట్రంలో వేల సంఖ్యలో మెడికల్ షాపులు, వందల సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉండగా సర్కారు కేవలం 60 మంది డ్రగ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లతో నెట్టుకొస్తోంది. ఏడాదిలో కనీసం ఒక్కసారి కూడా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేయడం లేదు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ హెచ్ లిస్టులో ఉన్న డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ ఎవరికి అమ్ముతున్నారో పేషెంట్ల వివరాలు, ప్రిస్ర్కిప్షన్ మెడికల్ షాపుల దగ్గర ఉండాలి. ఒక్క షాపులో కూడా ఈ రూల్​​ అమలైతలేదు.

సీరియస్‌‌‌‌గా తీసుకోవాలి
మన రాష్ట్రంలో కరోనా స్టార్ట్ అయ్యాక యాంటి బయాటిక్  వాడకం విపరీతంగా పెరి గింది. ముందు జాగ్రత్త పేరిట ప్రజలు విటమిన్ ట్యాబ్లెట్లు, యాంటి బయాటిక్స్‌‌‌‌, స్టెరాయిడ్స్ విపరీతంగా వాడుతున్నారు. ఇలా వాడడం వల్లే  రెసిస్టన్స్ పెరుగుతోంది. దీని గురించి  ప్రతి ఒక్కరూ సీరియస్‌‌‌‌గా ఆలోచించాలి. హైఎండ్ యాంటి బయాటిక్స్‌‌‌‌కు కూడా బ్యాక్టీరియా లొంగకపోతే, ఇక ఆ తర్వాత చేసేది ఏమీ ఉండదు. బ్లాక్ ఫంగస్ వంటి రోగాలు వచ్చి, లక్షల మంది అకారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని అరికట్టాలంటే మెడిసిన్ అమ్మకాలపై నిఘా పెంచాలి. ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు, పీఎంపీలను నియంత్రిచడంతో పాటు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలి.
- డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి, ఫార్మకాలజిస్ట్, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్

కామన్​ యాంటిబయాటిక్స్​ పనిచేస్తలేవ్​
జ్వరం వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గి, బ్యాక్టీరియా దాడి చేయడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం సహజం. ఈ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కామన్‌‌‌‌ యాంటి బయాటిక్స్‌‌‌‌ ఇస్తాం. కానీ, ఇప్పుడు చాలా మందిలో కామన్ యాంటి బయాటిక్స్‌‌‌‌ పనిచేయక, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌‌‌‌ కంట్రోల్ కావడం లేదు. సాధారణంగా కల్చర్ సెన్సిటివిటీ చేపించి, ఆ రిపోర్ట్ ఆధారంగా యాంటి బయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేమీ లేకుండానే యాంటి బయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు. మందులు పారకపోవడానికి ఇదే ప్రధాన సమస్య. ఇట్ల ఇష్టమొచ్చినట్లు యాంటి బయాటిక్స్​ వాడటంతో ఆర్గాన్స్​ దెబ్బతినే ప్రమాదం ఉంది. 
‑ డాక్టర్ జగదీశ్‌‌‌‌కుమార్, మెడికవర్ హాస్పిటల్స్‌‌‌‌, హైదరాబాద్