ఆడవాళ్లలోనే యాంటీబాడీస్ ఎక్కువుంటున్నయ్

ఆడవాళ్లలోనే యాంటీబాడీస్ ఎక్కువుంటున్నయ్
  • ఢిల్లీలో 97% మందికి కరోనా యాంటీబాడీలు
  • మగవాళ్ల కంటే మహిళల్లోనే ఎక్కువ 
  • ఒక్కో జిల్లాలో 95 శాతంపైగా మందికి యాంటీబాడీలు   
  • ఆరో సీరో సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: ఢిల్లీలో 97 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు ఆరో సీరో సర్వేలో వెల్లడైంది. సర్వే రిజల్ట్స్ ను హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ గురువారం వెల్లడించారు. అన్ని జిల్లాల్లో 95 శాతం మందికి పైనే యాంటీబాడీలు ఉన్నాయని చెప్పారు. ‘‘మగవాళ్ల కంటే మహిళల్లోనే యాంటీబాడీలు ఎక్కువ ఉన్నాయి. 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్నోళ్లలో 88 శాతం, 18 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్నోళ్లలో 97 నుంచి 98 శాతం యాంటీబాడీలు ఉన్నాయి” అని తెలిపారు. కరోనా టీకా వేస్కున్నోళ్లలో 97 శాతం యాంటీబాడీలు ఉండగా, వేస్కోని వాళ్లలో 90 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. 28 వేల శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించామని, ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సీరో సర్వే అని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్, మేలో వచ్చిన సెకండ్ వేవ్ తో ఢిల్లీ వణికిపోయింది. కేసులు, మరణాలు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. సెకండ్ వేవ్ తర్వాత నిర్వహించిన తొలి సీరో సర్వే ఇదే. అంతకుముందు జనవరిలో నిర్వహించిన సర్వేలో 56.13 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. 

కర్నాటకలో 33 మంది స్టూడెంట్లకు కరోనా..
కర్నాటక కొడగు జిల్లా మడికెరిలోని జవహర్ నవోదయ విద్యాలయలో 33 మంది స్టూడెంట్లకు కరోనా సోకింది. దీంతో ఆ స్కూల్ ను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. మొదట కొందరికి జ్వరం రాగా టెస్టులు చేయడంతో విషయం బయటపడింది. మొత్తం 287 మందికి టెస్టులు చేస్తే, 33 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. వీరిలో చాలామందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. వీరందరినీ హాస్పిటల్​కు తరలించామని, మిగతా పిల్లలందరినీ ఐసోలేషన్ లో ఉంచామని పేర్కొన్నారు. 

కొత్త కేసులు 16 వేలు.. 
దేశంలో కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 3.42 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం చెప్పింది. మరో 733 డెత్స్ నమోదయ్యాయని, మొత్తం మరణాల సంఖ్య 4,56,386కు పెరిగిందని తెలిపింది. కేరళ సర్కార్ మరణాల సంఖ్యను రివైజ్ చేసిందని, అందుకే డెత్స్ పెరిగాయంది. 

వచ్చే నెల 30 దాకా కరోనా ఆంక్షలు పొడిగింపు
పండుగల సీజన్ కావడంతో కరోనా నిబంధనలు నవంబర్ 30 దాకా కేంద్రం పొడిగించింది. మాస్క్​లు పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ వంటి రూల్స్ పాటించాలని కోరింది. పోయిన నెల28న జారీ చేసిన ఈ నిబంధనలు మరోసారి పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.

రష్యాలో ఒక్కరోజే 1,159 మంది మృతి
రష్యాలో కరోనా కేసులు, డెత్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 40,096 కేసులు, 1,159 డెత్స్ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇవే హయ్యెస్ట్ డైలీ డెత్స్ అని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి తీవ్రమవడంతో మాస్కోలో ఆంక్షలు విధించారు. స్టోర్స్, స్కూల్స్, జిమ్​లు, నైట్ క్లబ్స్, ఇతర ఎంటర్ టైన్ మెంట్ ప్లేసులను ఈ నెల 28 నుంచి నవంబర్ 7 దాకా మూసేయాలని ఆదేశించారు. ఫుడ్ స్టోర్లు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర కంపెనీలకు అనుమతిచ్చారు. మ్యూజియాలు, థియేటర్లలోకి టీకా వేస్కున్నోళ్లనే అనుమతించాలన్నారు.