కొత్త టెక్నాలజీ: నొప్పులు లేకుండానే కాన్పు

కొత్త టెక్నాలజీ: నొప్పులు లేకుండానే కాన్పు
  • నార్మల్ డెలివరీల కోసం ఎంటొనాక్స్ టెక్నాలజీ 
  • ప్రభుత్వ దవాఖాన్లలో వినియోగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం 
  • కింగ్ కోఠి ఆస్పత్రిలో పైలట్ ప్రాజెక్టు 
  • విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు 

హైదరాబాద్, వెలుగు: సిజేరియన్ డెలివరీలను తగ్గించి, నార్మల్ డెలివరీలను పెంచేందుకు ప్రభుత్వ దవాఖాన్లలో ఎంటొనాక్స్ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని ఆరోగ్య శాఖ భావిస్తోంది. పురిటి నొప్పులను తగ్గించే ఈ టెక్నాలజీని హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన పరికరాలు, గ్యాస్ సిలిండర్లను కూడా తెప్పించింది. వీటిని ఒకట్రెండు రోజుల్లోనే వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దవాఖాన్లలోనూ అందుబాటులోకి తెస్తామని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని పెద్దాస్పత్రుల్లో మాత్రమే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. 
 

నొప్పి వచ్చినప్పుడల్లా పీల్చాలె.. 
నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ మిశ్రమంతో తయారు చేసే గ్యాస్‌‌ను ఎంటొనాక్స్ అంటారు. అందుకే దీన్ని ఎంటొనాక్స్ టెక్నాలజీ అని పిలుస్తున్నారు. ఈ గ్యాస్ లో ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్‌‌ సమాన స్థాయిలో ఉంటాయి. పురిటి నొప్పుల సమయంలో మాస్క్‌‌ లేదా మౌత్ పీస్‌‌ ద్వారా గర్భిణిని ఈ గ్యాస్‌‌ పీల్చుకొమ్మని చెబుతారు. అది పీల్చుకున్న 15 నుంచి 20 సెకండ్లలోనే పని చేయడం మొదలవుతుంది. ఒకట్రెండు నుంచి ఐదు నిమిషాల పాటు నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. మళ్లీ నొప్పి వచ్చినప్పుడు గర్భిణి మళ్లీ గ్యాస్ ను పీలిస్తే, మరో 5 నిమిషాలు ఉపశమనం కలుగుతుంది. ఇలా నొప్పి వచ్చినప్పుడల్లా ఒకసారి పీల్చి వదిలేస్తే సరిపోతుంది. అందుకే గ్యాస్ ఎప్పుడు పీల్చాలో,  ఎంత పీల్చాలో నిర్ణయించుకునే వెసులుబాటు గర్భిణికే ఇస్తారు. ఈ గ్యాస్‌‌ పెయిన్ కిల్లర్, మత్తు మందు తరహాలో పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. గ్యాస్ ఎక్కువ, తక్కువ పీల్చినా ఎలాంటి సమస్య ఉండదంటున్నారు. దీంతో తల్లికి, బిడ్డకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు. 
 

నొప్పులు భరించలేక సిజేరియన్ల వైపు..  
ప్రస్తుతం దేశంలో ఎక్కువ శాతం సిజేరియన్ డెలివరీలు జరుగుతున్న రాష్ట్రం మనదే. దీనికి ఎన్నోకారణాల్లో పురిటి నొప్పులు కూడా ఒకటి. ఇప్పటి యువతులు నొప్పులకు భయపడి సిజేరియన్ డెలివరీనే ఎంచుకుంటున్నారు. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నిద్దామని డాక్టర్లు చెప్పినా.. సిజేరియన్‌‌ వైపే మొగ్గు చూపుతున్నారు. నొప్పులు తగ్గిస్తే నార్మల్‌‌ డెలివరీ కోసం గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఒప్పుకునే అవకాశం ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు సిజేరియన్ తగ్గించి, నార్మల్ డెలివరీలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రి హరీశ్‌‌రావు టార్గెట్లు పెట్టి మరీ నార్మల్ డెలివరీలు చేయిస్తున్నారు.