లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్

లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్

తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అనుష్క శెట్టి. రొమాంటిక్, డ్యాన్స్, యాక్షన్, కామెడీ... సీన్ ఏదైనా తనదైన శైలిలో అనుష్క నటించే విధానం అందరికి నచ్చుతుంది. అందం, అభినయం ఆమె సొంతం. అనుష్క సినిమా వస్తుంది అంటే చాలు.. స్టార్ హీరోల సినిమా వస్తే థియేటర్ల వద్ద ఎలా ఉంటుందో.. అలాంటి హడావుడి కనిపిస్తుంది.  ఓ సినిమా కోసం... అప్పటివరకు నాజుకుగా ఉన్న అనుష్క.. లావుగా తయారైంది. అనుష్క నటించిన సినిమాల్లో... దాదాపు అన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అరుంధతిలో జేజమ్మ, బాహుబలిలో దేవసేన, వేదంలో సరోజా, ఆ తర్వాత రుద్రమదేవిగా అనుష్క ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఒక్కో సినిమాలో పాత్రకు తగ్గట్టు తనను తాను మార్చుకున్న ఈ బ్యూటీ.. ఇవాళ తన 41వ పుట్టిరోజు జరుపుకుంటోంది.

అందం, అభినయంతో  తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన అనుష్క గుర్తించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో... తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క అడుగుపెట్టింది. అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. మొదట్లో కాస్త గ్లామర్ ఎక్కువ ఉన్న రోల్స్ చేసినా.. ఆ తర్వాత ఆమెకు కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు వచ్చాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. మల్లెమాల నిర్మాణంలో వచ్చిన అరుంధతి సినిమా ఆమె సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 

ఇక బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా మారింది. ఈ సినిమాలో అనుష్క నటించిన విధానం.. కనిపించిన తీరు.. కత్తి పట్టి యుద్ధం చేస్తూ హీరోకి మించి ఆమె చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా నటిగా మారింది అనుష్క. 

వేదం సినిమాలో అనుష్క సరోజ పాత్రలో నటించింది. వ్యభిచారాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే సరోజ సంకల్పాన్ని..  ఈ మూవీలో అద్భుతంగా చిత్రీకరించారు. అప్పటివరకు అనుష్క నటించిన క్యారెక్టర్లు వేరు.. అయితే ఈ సినిమా తర్వాత కూడా అనుష్క క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సరోజ పాత్రలో అనుష్క నటించిన విధానం ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేసింది. 

ఆ తర్వాత సైజ్ జీరో సినిమాతో వచ్చిన ఈ అమ్మడు.. తన పాత్ర కోసం 25 కిలోల బరువు పెరిగింది. ఇది చూస్తే ఆమె తన వృత్తి పట్ల ఎంత అంకితభావంతో ఉందో అర్థం అవుతుంది. ఆ తర్వాత వచ్చిన రుద్రమదేవి కూడా అనుష్క రేంజ్ ని ఏ మాత్రం తగ్గించలేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు నటించారు. ఇదిలా ఉంటే.. అనుష్క 1981 నవంబర్ 7న జన్మించింది.  మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తులు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని పిలుస్తారు.