ఇండియా వస్తే రండి లేదంటే లేదు: బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ.. 24 గంటల డెడ్ లైన్

ఇండియా వస్తే రండి లేదంటే లేదు: బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ.. 24 గంటల డెడ్ లైన్

దుబాయ్: 2026 టీ20 వరల్డ్ కప్‎లో తమ మ్యాచ్‌లను ఇండియా నుంచి తటస్థ వేదికలకు తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు బుధవారం (జనవరి 21) ఐసీసీ బోర్డు మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశంలో బీసీబీ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహించగా మెజార్టీ దేశాలు బంగ్లా అభ్యర్థనను తిరస్కరించాయి. బంగ్లాదేశ్ ఇండియా వెళ్లేందుకు నిరాకరిస్తే ఆ జట్టు స్థానంలో కొత్త టీమ్‎ను భర్తీ చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేయాలని బీసీబీకి సూచించింది ఐసీసీ. వచ్చే 24 గంటల్లో తమ నిర్ణయం ఏంటో చెప్పాలని బీసీబీకి ఐసీసీ డెడ్ లైన్ విధించింది. 

ALSO READ | IND vs NZ: తొలి టీ20లో టాస్ ఓడిన ఇండియా.. కుల్దీప్, అయ్యర్‌లకు నిరాశ

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న 2026 టీ20 వరల్డ్ కప్‎లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. భద్రతా పరమైన కారణాలతో ఇండియాలో ఆడలేమని బంగ్లా తేల్చి చెప్పింది. తమ మ్యాచులను ఇండియా బయట తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని రిక్వెస్ట్ చేసింది. అయితే.. బంగ్లా అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ ఖరారు కావడంతో ఈ సమయంలో వేదికను మార్చలేమని తెగేసి చెప్పింది. 

వరల్డ్ కప్ ఆడతారో లేదా ఇక మీరే డిసైడ్ చేసుకోవాలని 2026, జనవరి 21వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది. అయితే.. వరల్డ్ కప్‎లో తమ స్థానాన్ని వేరే జట్టుతో రీప్లేస్ చేస్తారనే  బెదిరింపు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ జట్టు ఇండియాకు వచ్చి క్రికెట్ ఆడదని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారుడు నజ్రుల్ తేల్చి చెప్పాడు. ఓ వైపు ఐసీసీ.. మరోవైపు బీసీసీ వెనక్కి తగ్గకపోవడంతో 2026 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.