ఓయూలో హాస్టల్ స్టూడెంట్ల ఆందోళన

ఓయూలో హాస్టల్ స్టూడెంట్ల ఆందోళన
  •     సెక్యూరిటీ కల్పించాలని రోడ్డుపై బైఠాయింపు
  •     వీసీ, రిజిస్ట్రార్ కు చెప్పినా స్పందించడం లేదు
  •     హాస్టల్ డైరెక్టర్ ను తొలగించాలని డిమాండ్

ఓయూ, వెలుగు : హాస్టల్ లో తమకు భద్రత లేదంటూ ఓయూ రిసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రివేళ హాస్టల్​లోకి దొంగలు చొరబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇలా చాలా సార్లు జరిగిందని, వర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గురువారం వర్సిటీ మెయిన్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం  4.00 గంటల సమయంలో లేడీస్ హాస్టల్ పీహెచ్ డీ  భవనం లోకి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దాదాపు 12 గంటలు హాస్టల్ భవనంలోనే ఉండి మహిళా విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. 

లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కి చెప్పినా పట్టించుకోకపోవడంతో తాము ఆందోళనకు దిగామని చెప్పారు. ఇదేవిధంగా గతంలో నాలుగైదు సార్లు జరిగినా అధికారులు ఏమాత్రం స్పందించలేదని ఆరోపించారు.  సుమారు 6 గంటలు పాటు రాస్తారోకో చేసినా వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో ఓయూకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పుకుంటున్న ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. 

దొంగలను ఎందుకు కనిపెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. హాస్టల్​ గోడ నిర్మాణం పెంచి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని కోరారు. తమ భద్రతపై నిర్లక్ష్యం వహించిన హాస్టల్ డైరెక్టర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. వివిధ విద్యార్థి సంఘాల నేతలు  పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. పోలీసులు ముందుజాగ్రత్తగా క్యాంపస్  దారిని మూసివేశారు.