వ్యక్తి ప్రయోజనమా..? ప్రజల ప్రయోజనమా..? ఆలోచించండి

వ్యక్తి ప్రయోజనమా..? ప్రజల ప్రయోజనమా..? ఆలోచించండి
  • ఏ అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యం: మంత్రి హరీష్ రావు

కరీంనగర్: ‘‘వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా?  ప్రజల ప్రయోజనం ముఖ్యమా ఆలోచించండి. బీజేపీ గెలిస్తే ఈటల ఒక్కడికే ప్రయోజనం. ఏ అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యం’’ అని మంత్రి హరీష్ రావు అన్నారు. జమ్మికుంట టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి  హరీశ్ రావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గానికి గెల్లు శ్రీనివాస్ రూపంలో ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డి రూపంలో ఎమ్మెల్సీ... మీకు డబుల్ ధమాకా అవకాశంవచ్చిందన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. అసలు ఇక్కడ కాంగ్రెస్ ఉందా?  ఇక్కడ రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ అని హరీష్ రావు పేర్కొన్నారు. 
కార్మిక బంధువులు గెలవాలా, కార్మిక ద్రోహులు గెలవాలా
కార్మిక బంధువులు గెలవాలా లేక కార్మిక ద్రోహులు గెలవాలా..? ఆలోచించండి అని మంత్రి హరీష్ రావు సూచించారు. కేసీఆర్ గెలిచాకా రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం జలాలు, కడుపునిండా ఉచిత కరెంట్ వచ్చిందన్నారు. బీజేపీ వచ్చాక మార్కెట్ యార్డులు రద్దు, డీజీల్ ధరల పెంచు రైతులపై భారం పెంచార,ఎరువుల ధరలు పెంచి, రైతులపై భారం మోపేవారు రైతు ద్రోహులు కాదా?  అని ఆయన ప్రశ్నించారు. రైతులు ధర్నాలు చేస్తే.. రోడ్లపై మేకులు కొట్టి రబ్బరు బుల్లెట్లతో, బాష్పవాయు గోళాలతో కొట్టించారు, మద్ధతు ధర, మార్కెట్ కావాలని కోరితే తలలు పగులగొట్టించారు, రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి కరెంట్ భారం పెంచాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 
బీజేపీ వాళ్లు కరెంట్ లెక్కలు వేస్తుంటే.. కేసీఆర్ ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, మరి మీరు ఎవరి వైపు ఉంటారో ఆలోచించాలని కోరారు. రైతు బంధువులెవరో, రైతు ద్రోహులెవరో ఆలోచించి ఎటువైపు ఉండాలో ఆలోచించాలన్నారు. కార్మికులు 12 గంటలు పనిచేసేలా కార్మిక చట్టాలు తెస్తోంది బీజేపీ, మనమేమో 8 గంటల పనివిధానం, అంతకు మించి పనిచేస్తే ఓవర్ టైం ఇస్తున్నాం, వాళ్లకు ఓటేయడమంటే 12 గంటల పనికి కార్మికులు ఒప్పుకున్నట్లేనన్నారు. బీజేపీకి ఓటేస్తే పెంచిన డీజిల్ ధరలకు, మార్కెట్ యార్డులు రద్దుకు మనం ఒప్పుకున్నట్లేనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ కూడా ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నందున 4 వేలు ఇచ్చినా...  నిర్మాణాలు పూర్తి చేయలేదు, మిగతా చోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకుంటే హుజురాబాద్ లో మాత్రం ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.  
మాట మాట్లాడితే ఆత్మగౌరవం అంటున్నాడు ఈటల, ఏడేళ్ల క్రితం మంజూరు చేసిన ఇండ్లు కట్టించిఉంటే నాలుగువేల మంది ఆత్మగౌరవంతో బ్రతకకపోదురా, ఏడేళ్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచి ఇండ్లు కట్టగలడా?  గెలిస్తే ఆయనేమేమైనా మంత్రయ్యేది ఉందా... ? అసలు ఆయన బీజేపీలో ఎందుకు చేరాడు?
ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. రెండేళ్లలో ఒక్క లక్ష రూపాయల పనైనా చేసాడా?  ఎంపీగా బండి సంజయ్ చేయని పనులు.. అదే పార్టీ నుంచి ఈటల రాజేందర్ గెలిస్తే ఏం చేయగలడు.? అని ప్రశ్నించారు. 
బీజేపీ వాళ్లు ఏం చేయలేదన్నది అబద్దం... వాళ్లు ఎన్నో ప్రభుత్వ సంస్థలు అమ్మకానికి పెట్టారు, పెట్రోలు, డీజీలు, గ్యాస్ ధరలు పెంచారు.. ఇవన్నీ చేసింది వాళ్లే కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఆస్పత్రులు కడుతుంటే.. బీజేపీ వాళ్లేమో అమ్ముతున్నారు.  కట్టేవాళ్లవైపు ఉందామా..? అమ్మే వాళ్లవైపు ఉందామా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్పేటోడు.. ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేకనే.. ఇవన్నీ పంచుతున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరిన ఈటల.. మాటలన్నీ ఎర్రజెండా మాటలు మాట్లాడుతున్నాడు. ఇదెక్కడి కథ, కాషాయ జెండా చేతిలో పట్టుకుని .. ఎర్రజెండా డైలాగులు కొడితే ఎవరూ నమ్మరు. ప్రజలు అమాయకులు కారని హెచ్చరించారు.  దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ రెండు వేల కోట్లు తేవాలి. మనం వద్దంటున్నమా? 9 నెలల క్రితం దుబ్బాకలో గెలిచినాయన ఏం చేసాడు, ఆయన కూడా గెలవకముందు ఎన్నో చెప్పాడు, రైలు తెస్తా, అది తెస్తా అంటూ చెప్పిన ఆయన  నోటికే మొక్కాలి... ఏవోవో చెప్పాడు. ఒక్కటీ రాలేదన్నారు. 2018లో హుజూరాబాద్ లో  బీజేపీకి వచ్చిన ఓట్లు 2 వేలు మాత్రమే, వాళ్లకు డిపాజిటే రాలేదన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించండి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా అప్పటిదాకా అందరూ కష్టపడండి, ఎన్నికలయ్యాక మరో రెండేళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం. ఏ ఆపద ఉన్నా నేను అండగా ఉంటానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.