ప్రజలకు వ్యాక్సిన్‌ వేస్తే ప్రతిపక్షాలకు సైడ్‌ ఎఫెక్ట్స్‌

V6 Velugu Posted on Sep 18, 2021

  • లాజిక్ ఏంటో చెప్పాలని డాక్టర్లను కోరిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 2.5 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేస్తే.. సైడ్ ఎఫెక్ట్స్‌ ప్రతిపక్షాలకు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. నిన్న అర్ధరాత్రి 12 తర్వాత ఓ పొలిటికల్ పార్టీకి జ్వరం పట్టుకుందని, దీని వెనుక ఏదైనా లాజిక్ ఉందా అంటూ ఆయన సెటైర్లు వేశారు. దీనిపై డాక్టర్లు ఏమైనా వివరణ చెప్పగలరా అని అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను ప్రజలకు వేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంపై ప్రధాని ఇవాళ గోవా హెల్త్ సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఒక్క రోజులోనే ఇంతటి భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ చేసిన డాక్టర్లు, ఇతర మెడికల్ సిబ్బంది, ఈ కార్యక్రమంలో భాగమైన వారందరికీ మోడీ అభినందనలు తెలిపారు. ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందిన దేశాలకే సాధ్యం కాలేదని ఆయన అన్నారు.

నేను సైంటిస్ట్‌నో, డాక్టర్‌‌నో కాదు.. నాకొక డౌట్‌

‘‘నిన్న దేశంలో 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశాం. సగటున గంటలో 15 లక్షల డోసులు, నిమిషానికి 26 వేల డోసులు, సెకనుకు 425 డోసులు చొప్పున వ్యాక్సినేషన్ చేశాం” అని మోడీ అన్నారు. అయితే తనకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఒక డౌట్ ఉందని, దానికి క్లారిటీ ఇవ్వాలని ఆయన డాక్టర్లను కోరారు. ‘‘నేను సైంటిస్టునో, డాక్టర్‌‌నో కాదు.. మామూలుగా వ్యాక్సిన్‌ వేసుకుంటే ఆ వ్యక్తికి జ్వరం, తలనొప్పి రావడం లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని విన్నాను. అయితే తొలిసారి నిన్న 2.5 కోట్ల మందికి రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌ వేయడంతో అర్ధరాత్రి తర్వాత ఒక పొలిటికల్ పార్టీకి జ్వరం వచ్చింది. జనాలకు వ్యాక్సిన్ వేస్తే ప్రతిపక్షాలకు సైడ్‌ఎఫెక్ట్స్ రావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ డౌట్ తీరుస్తారా? దీని వెనుక ఏదైనా లాజిక్‌ ఉందా?” అని మోడీ అడిగారు. ఈ సంరద్భంగా డాక్టర్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న వాళ్లంతా నవ్వుకున్నారు. డాక్టర్ నితిన్‌ ధుపదలే నవ్వుతూ.. తాము వ్యాక్సిన్‌ వేశాక ప్రజలకు సైడ్‌ ఎఫెక్ట్స్ గురించి వివరించామని, టీకా వేసుకున్నా కూడా మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి కొవిడ్ జాగ్రత్తలను పాటించాల్సిందేనని చెప్పామని అన్నారు.

Tagged corona vaccination, pm modi, India, opposition parties, Side Effects

Latest Videos

Subscribe Now

More News