కృష్ణా నీటిని మళ్లించేందుకు ఏపీ అడ్డదారి

కృష్ణా నీటిని మళ్లించేందుకు ఏపీ అడ్డదారి
  • హంద్రీనీవా కాలువల విస్తరణ పనులకు టెండర్‌‌
  • కొత్తగా 5 పంపుహౌస్‌‌ల నిర్మాణం

హైదరాబాద్‌‌, వెలుగు: అక్రమ ప్రాజెక్టులపై ఏపీ దూకుడు కొనసాగిస్తోంది. శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని మళ్లించేందుకు అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ కెపాసిటీ పెంపు, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌కు తోడు ఇతర ప్రాజెక్టుల విస్తరణ పనుల్లో వేగం పెంచింది. ఇదివరకే గాలేరు–నగరి నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌) లింక్‌‌ పనులకు టెండర్లు పిలిచిన ఏపీ సర్కారు, తాజాగా హంద్రీనీవా విస్తరణ పనులు చేపట్టబోతుంది. కాలువ విస్తరణతో పాటు కొత్తగా ఐదు పంపుహౌస్‌‌లు నిర్మించనుంది. ఇందుకు రూ.2,487 కోట్లతో టెండర్లు పిలిచింది. టెండర్ల ప్రక్రియ ఈనెల 15తో ముగియనుంది. హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌ 4.80వ కి.మీ.ల నుంచి 88వ కి.మీ.ల వరకు 6,300 క్యూసెక్కుల నీటిని తరలించేలా విస్తరించడం, కాలువ లైనింగ్‌‌ పనులు చేపట్టనున్నారు. దీనిపై కొత్తగా ఐదు పంపుహౌస్‌‌లు నిర్మించనున్నారు. ఆయా పంపుహౌస్‌‌ల ఫోర్‌‌బే, సర్జ్‌‌పూల్‌‌, డెలివరీ మెయిన్స్‌‌, పంపులు, మోటార్లు ఏర్పాటు చేయాలని కోరారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌‌ 15 ఏండ్ల పాటు నిర్వహణ కూడా చూడాలని టెండర్‌‌లో పేర్కొన్నారు. గాలేరు–నగరి నుంచి హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ లింక్‌‌ పనులకు 2020 డిసెంబర్‌‌లో రూ.6,348 కోట్లతో టెండర్లు పిలిచారు. గాలేరు–నగరి ద్వారా తరలించే నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కాల్వ విస్తరణ సహా ఇతర పనులు చేపట్టనున్నారు.