మీ ఇద్దరి మూలాలు కదిలిపోతాయ్: చంద్రబాబు హెచ్చరిక

మీ ఇద్దరి మూలాలు కదిలిపోతాయ్: చంద్రబాబు హెచ్చరిక

మదనపల్లె: వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడి తమను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ మూలాలే కదిలిపోతాయని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ డేటా ప్రైవసీపై కేసీఆర్ సర్కార్ తీరు తాతకు దగ్గులు నేర్పిస్తున్నట్టు ఉందని ఆయన అన్నారు. తన ప్రభుత్వ డేటా ప్రైవసీని వాళ్లు కాపాడతారా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వానికి డేటా ఉందని, దాన్ని తాను కాపాడుకోగలనని చెప్పారు. సీక్రెసీ మెయింటెన్ చేయగలనన్నారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజల డేటా దొంగిలించిందని వైఎస్ఆర్ సీపీ చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డేటాను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందా అంటూ మండిపడ్డారు.

‘‘ఇది పోలీస్ రాజ్యామా.. ప్రజాస్వామ్యమా.. నియంత రాజ్యమా.. మీరు చేసేదేమిటి? కాంగ్రెస్ హయాంలో ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ జరగలేదు. 1984 నుంచి ఈదేశంలో ఐటీ అంటే మారుపేరు నేను. ఐటీ సంస్కరణలతో సెల్ ఫోన్ వినియోగానికి శ్రీకారం చుట్టిందే నేను. మీ (తెలంగాణ) ప్రభుత్వానికి డేటా లేదు.. నా ప్రభుత్వానికి డేటా ఉంది. నేను కాపాడుకోగలను. 50 వేల మందితో రోజూ మాట్లాడుతున్నాను. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు ఎలా వచ్చాయి? సైబరాబాద్ ఎలా వచ్చింది? దారిన పోయే దానయ్యలు ఫిర్యాదు చేస్తే.. తమాషాలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి లాలూచీ పడి.. దెబ్బ తీస్తామంటే.. మీ మూలాలు కూడా కదిలిపోతాయి. ఎక్కడా తిరిగే పరిస్థితిలేదు. డేటా మన సొంతం. చట్టపరంగా వెళతా.. వైఎస్ఆర్సీపీ  దొంగలు కంప్లైంట్ ఇస్తే.. దాడులు జరుపుతారా? నియంత ప్రవర్తన నా దగ్గర సాగదు. మాదొక రాష్ట్రం.. మీదొక రాష్ట్రం. మాకు అన్యాయం జరిగింది. తెలుగు వాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. ఎక్కడ ఉన్నా పోరాడి రక్షించే బాధ్యత నేను తీసుకుంటా.. పనికి మాలిన రాజకీయాలు వదిలిపెట్టండి’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు చంద్రబాబు. కాగా, చంద్రబాబు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఐటీ గ్రిడ్ సంస్థ తప్పుచేయకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి భయమెందుకు అని ఆయన ప్రశ్నించారు.