శ్రీశైలం మల్లన్న నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్దాం.. శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం

శ్రీశైలం మల్లన్న నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్దాం.. శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం

 

  • దేవుళ్లను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దాం: చంద్రబాబు 
  • తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదు 
  • గోదావరి నీళ్లు వాడుకొమ్మని వాళ్లకు చెప్పిన 
  • నదుల అనుసంధానానికి సహకరించాలని కోరాను 
  • నంద్యాల సభలో ఏపీ సీఎం వ్యాఖ్యలు 

హైదరాబాద్, వెలుగు: రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వడం, కనీసం రెండు మెట్ట పంటలు వేసుకునేలా నీటి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోగలిగితే రైతుల కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని అన్నారు. గురువారం నంద్యాల జిల్లా మల్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. “శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమయ్యే నీళ్లను కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల మీదుగా 600 కిలోమీటర్ల మేర తరలించి తిరుమల వెంకన్న వరకు తీసుకెళ్లవచ్చు. రైతుల కష్టాలు తీర్చడమే కాదు.. దేవుళ్లను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దాం. ఈ రకమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుందాం” అని చంద్రబాబు అన్నారు. ‘‘ఇటీవల ఢిల్లీలో రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నీటి సమస్యలపై చర్చ జరిగింది. ఇబ్బందులు, రాజకీయాలు ఉంటాయి. వీటిని అధిగమించి సమస్యను పరిష్కరిస్తాం. తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదు. రెండు రాష్ర్టాల మధ్య ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దామని మీటింగ్‌లో చెప్పాను. అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకొమ్మని తెలంగాణకు చెప్పాను. నదుల అనుసంధానానికి సహకరించాలని కోరాను. తెలంగాణ, ఏపీ రెండూ బాగుండాలి. గోదావరి బోర్డు హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు విజయవాడలో పెడుతున్నాం. శ్రీశైలం ప్లంజ్ పూల్ రిపేర్లకు మనమే డబ్బులిచ్చి పనులు చేయిస్తాం” అని తెలిపారు. ‘‘నన్ను బూతులు తిట్టినా, శాపనార్థాలు పెట్టినా నేను పట్టించుకోను.. వెనకడుగు వేయను. అలాంటోళ్లు నన్నేం చేయలేరు” అని అన్నారు.